విజయశాంతి `కర్తవ్యం`కి 32 ఏళ్ళు!
on Jun 29, 2022

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి స్థాయిని పెంచిన చిత్రాల్లో `కర్తవ్యం`కి ప్రత్యేక స్థానం ఉంది. మహిళా పోలీస్ అధికారి కిరణ్ బేడి జీవితం స్ఫూర్తితో తెరకెక్కిన ఈ కాప్ డ్రామాలో.. ASP వైజయంతీ గా శక్తిమంతమైన పాత్రలో ఆకట్టుకున్నారు విజయశాంతి. అంతేకాదు.. తన అద్భుత అభినయంతో `ఉత్తమ నటి`గా తొలి `జాతీయ` పురస్కారం అందుకున్నారు. అలాగే, `బెస్ట్ యాక్ట్రస్`గా ఇటు `నంది`, అటు `ఫిల్మ్ ఫేర్` అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన చేశారు. ఇందులో వినోద్ కుమార్, నిర్మలమ్మ, మీనా, చరణ్ రాజ్, అట్లూరి పుండరీకాక్షయ్య, రవితేజ, ఉదయ్ ప్రకాశ్, సాయికుమార్, నూతన్ ప్రసాద్, పి.ఎల్. నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, నర్రా వెంకటేశ్వరరావు, తాతినేని రాజేశ్వరి, బాబూ మోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
రాజ్ - కోటి పాటలు, నేపథ్య సంగీతం `కర్తవ్యం`కి ప్రధాన బలంగా నిలిచాయి. సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మించిన `కర్తవ్యం`.. 1990 జూన్ 29న విడుదలై అఖండ విజయం సాధించింది. అలాగే, `వైజయంతీ ఐపీఎస్`తో పేరుతో తమిళంలో అనువాదమై అక్కడా ఘనవిజయం సాధించింది. అదేవిధంగా, హిందీలో `తేజస్విని`(1994) పేరుతో విజయశాంతి ప్రధాన పాత్రలో రీమేక్ అయింది. కాగా, నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ 32 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



