`అసెంబ్లీ రౌడీ`గా మోహన్ బాబు అలరించి నేటికి 31 ఏళ్ళు!
on Jun 3, 2022

`కలెక్షన్ కింగ్` మోహన్ బాబు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `అసెంబ్లీ రౌడీ` ఒకటి. 1990 నాటి తమిళ సినిమా `వేలై కిడైచ్చిడుచ్చు` (సత్యరాజ్, గౌతమి) ఆధారంగా తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామాలో మోహన్ బాబుకి జోడిగా దివ్యభారతి దర్శనమివ్వగా.. అగ్ర దర్శకుడు బి. గోపాల్ జనరంజకంగా తీర్చిదిద్దారు. అనూహ్య పరిస్థితుల్లో జైలుపాలయిన శివాజీ అనే యువకుడు.. ఎలా ఎం.ఎల్.ఎ అయ్యాడు? ఈ క్రమంలో ఏం కోల్పోయాడు? అనే అంశాల చుట్టూ `అసెంబ్లీ రౌడీ` తిరుగుతుంది. జగ్గయ్య, అన్నపూర్ణ, గొల్లపూడి మారుతిరావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, పాకీజా, మోహన్ రాజ్, ప్రసాద్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన `అసెంబ్లీ రౌడీ`కి పరుచూరి బ్రదర్స్ అందించిన స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దిగ్గజ సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా, ``అందమైన వెన్నెలలోన`` (కేజే ఏసుదాస్, కేయస్ చిత్ర గానం - రసరాజు సాహిత్యం) అంటూ సాగే గీతం ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలవగా.. ``పంతులో పంతులు``, ``తానాల గదిలోన``, ``పేకల్లో జోకర్ లా``, ``తూరుపు కొండల్లో`` అంటూ మొదలయ్యే పాటలు కూడా రంజింపజేశాయి. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్ బాబు స్వయంగా నిర్మించిన `అసెంబ్లీ రౌడీ`.. 1991 జూన్ 3న విడుదలై ఘనవిజయం సాధించింది. కాగా, నేటితో ఈ చిత్రం 31 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



