'పోలీస్ బ్రదర్స్'గా వినోద్ కుమార్, చరణ్ రాజ్ అలరించి 30 ఏళ్ళు!
on Jul 4, 2022
తెలుగునాట రచయితగా తనదైన ముద్రవేశారు పోసాని కృష్ణమురళి. అలాంటి.. పోసాని కెరీర్ లో మొదటి సినిమాగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది 'పోలీస్ బ్రదర్స్' చిత్రం. వినోద్ కుమార్, చరణ్ రాజ్ టైటిల్ రోల్స్ లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్రముఖ దర్శకుడు మోహన్ గాంధీ తెరకెక్కించారు. వినోద్ కుమార్ కి జంటగా రోజా సందడి చేసిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, దేవన్, బాబూ మోహన్, మనోరమ, ఢిల్లీ గణేశ్, పరుచూరి వెంకటేశ్వర రావు, జ్యోతి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి తనయుడు శ్రీ ఈ సినిమాతోనే సంగీత దర్శకుడిగా తొలి అడుగేయడం విశేషం. మొదటి ప్రయత్నంలోనే తన బాణీలతో, నేపథ్య సంగీతంతో మెప్పించారు శ్రీ. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వెంకట సుబ్బారావు నిర్మించిన 'పోలీస్ బ్రదర్స్'.. హిందీలో 'ముకాబ్‌లా' (గోవిందా, ఆదిత్యా పంచోలి, కరిష్మా కపూర్, ఫరా) పేరుతో తాతినేని రామారావు దర్శకత్వంలో రీమేక్ అయింది. కాగా, 1992 జూలై 4న విడుదలై మంచి విజయం సాధించిన 'పోలీస్ బ్రదర్స్'.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
