'వై దిస్ కొలవెరి'.. రీరిలీజ్ లో అదరగొడుతున్న ధనుష్ '3'
on Sep 8, 2022

'వై దిస్ కొలవెరి' సాంగ్ తో కోలీవుడ్ హీరో ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపింది. ఈ పాట ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన '3' చిత్రంలోనిది. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఈ చిత్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కి కూడా ఇదే మొదటి సినిమా. అనిరుధ్ కంపోజ్ చేయగా, ధనుష్ ఆలపించిన 'కొలవెరి' సాంగ్.. భాషతో సంబంధం లేకుండా అందరిని మెప్పించి సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. అయితే మూవీ మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టులేకపోయింది. ఊహించనివిధంగా పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా.. ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్స్ బాట పట్టడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల తెలుగులో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. మహేష్ బాబు 'పోకిరి', పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమాలు రీరిలీజ్ లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటాయి. మహేష్, పవన్ తెలుగు స్టార్స్ కాబట్టి వాళ్ళ సినిమాల స్పెషల్ షోలు వేస్తే ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్స్ కి రావడం సహజం. అయితే ఒక డబ్బింగ్ ఫిల్మ్, అందులోనూ హిట్ కాని చిత్రాన్ని రీరిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సెప్టెంబర్ 8 నుంచి '3' మూవీ స్పెషల్ షోలు వేయబోతున్నట్లు ప్రకటన వచ్చినప్పుడు ఈ చిత్రాన్ని ఎవరు చూస్తారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్య పోతున్నాయి. కొన్ని చోట్ల అదనపు షోలు కూడా వేస్తున్నారట. మరి రీరిలీజ్ తో '3' మూవీ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



