2022 ఫస్టాఫ్ రివ్యూ 13: సందడంతా వీరిదే!
on Jul 1, 2022
2022 ఫస్టాఫ్ లో రెండు, అంతకుమించి సినిమాలతో కొందరు ప్రముఖ హీరోహీరోయిన్లు సందడి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
రామ్ చరణ్ః
ఈ క్యాలెండర్ ఇయర్ ఫస్టాఫ్ లో రెండు సినిమాలతో పలకరించిన ఏకైక టాప్ స్టార్.. రామ్ చరణ్. మార్చి 25న `ఆర్ ఆర్ ఆర్`, ఏప్రిల్ 29న `ఆచార్య`తో జనం ముందుకు వచ్చాడు చరణ్. ఈ రెండు మల్టిస్టారర్స్ లో `ఆర్ ఆర్ ఆర్` సెన్సేషన్ క్రియేట్ చేయగా.. `ఆచార్య` డిజప్పాయింట్ చేసింది.
రానా దగ్గుబాటిః
ఈ ఏడాది ప్రథమార్ధంలో రానా దగ్గుబాటి నుంచి మూడు చిత్రాలు వచ్చాయి. జనవరిలో `1945`, ఫిబ్రవరిలో `భీమ్లా నాయక్`, జూన్ లో `విరాట పర్వం`తో పలకరించాడు రానా. వీటిలో ప్రతినాయకుడిగా నటించిన `భీమ్లా నాయక్` చెప్పుకోదగ్గ విజయం సాధించింది.
వరుణ్ తేజ్ః
ఈ సంవత్సరం ప్రథమార్థంలో వరుణ్ తేజ్ రెండు సినిమాలతో ఎంటర్టైన్ చేశాడు. ఏప్రిల్ లో `గని`తోనూ, మే నెలలో `ఎఫ్ 3`తోనూ వినోదాలు పంచాడు వరుణ్. వీటిలో `ఎఫ్ 3` ఓకే అనిపించుకుంది.
పూజా హెగ్డేః
2022 ఫస్టాఫ్ లో పూజా హెగ్డే హవా బాగా సాగింది. `రాధే శ్యామ్`, `బీస్ట్` (తమిళ్ డబ్బింగ్), `ఆచార్య`లో హీరోయిన్ గానూ.. `ఎఫ్ 3`లో ఐటమ్ గాళ్ గానూ దర్శనమిచ్చింది పూజ. వీటిలో `ఎఫ్ 3` ఒక్కటే ఫర్లేదనిపించింది.
కీర్తి సురేశ్ః
ఈ ఏడాది ప్రథమార్ధంలో కీర్తి సురేశ్ నుంచి `గుడ్ లక్ సఖి`, `చిన్ని` (తమిళ అనువాదం), `సర్కారు వారి పాట`, `వాషి` (మలయాళం) రాగా.. వీటిలో ఓటీటీ రిలీజ్ అయిన `చిన్ని` నటిగా మంచి పేరును తీసుకువచ్చింది. `సర్కారు వారి పాట` చెప్పుకోదగ్గ ఫలితాన్ని అందించింది.
తమన్నాః
ఏప్రిల్ లో `గని`లోని స్పెషల్ సాంగ్ తోనూ.. మేలో `ఎఫ్ 3`లోని కథానాయిక పాత్రతోనూ 2022 ఫస్టాఫ్ లో సందడి చేసింది తమన్నా. వీటిలో `ఎఫ్ 3` అలరించింది
సయీ మంజ్రేకర్ః
ఈ ఏడాది ఫస్టాఫ్ లో ఉత్తరాది భామ సయీ మంజ్రేకర్ రెండు సినిమాలతో పలకరించింది. ఏప్రిల్ లో `గని`, జూన్ లో `మేజర్` విడుదల కాగా.. వీటిలో `మేజర్` బ్లాక్ బస్టర్ బాట పట్టింది.
వీరితో పాటు `భామా కలాపం`, `విరాట పర్వం` (ముఖ్య పాత్ర)తో ప్రియమణి.. `సెబాస్టియన్ పీసీ 524`, `సమ్మతమే`తో కిరణ్ అబ్బవరం కూడా 2022 ప్రథమార్ధంలో రెండేసి సినిమాలతో పలకరించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
