మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్ `ఇంద్ర`కి 19 ఏళ్ళు!
on Jul 24, 2021
మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే పలు శక్తిమంతమైన పాత్రలు కళ్ళముందు కదలాడతాయి. అలా.. చిరు పోషించిన పవర్ ఫుల్ రోల్స్ లో `ఇంద్ర` చిత్రంలోని ఇంద్రసేనా రెడ్డి ఒకటి. `అన్నయ్య` (2000) తరువాత తన స్థాయి విజయాన్ని మళ్ళీ అందుకోలేకపోయిన మెగాస్టార్ కి.. `ఇంద్ర` బ్లాక్ బస్టర్ ని అందివ్వడమే కాకుండా, మరో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసింది. అంతేకాదు.. `జగదేక వీరుడు అతిలోక సుందరి` (1990), `చూడాలని ఉంది` (1998) తరువాత వైజయంతీ మూవీస్ సంస్థలో చిరు నటించిన ఈ సినిమా.. అశ్వనీదత్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా నిలిచింది.
ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఇంద్రసేనారెడ్డి, శంకర్ నారాయణగా రెండు ఛాయలున్న పాత్రలో అలరించారు చిరు. భారీ విజయాల దర్శకుడు బి. గోపాల్ రూపొందించిన ఈ చిత్రంలో చిరుకి జంటగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ఆడిపాడగా.. ఇతర ముఖ్య పాత్రల్లో ముకేశ్ రిషి, శివాజీ, లహరి, ప్రకాశ్ రాజ్, పునీత్ ఇస్సార్, తనికెళ్ళ భరణి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సునీల్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీయస్, తెలంగాణ శకుంతల, శివకృష్ణ, కల్పన అలరించారు. అతిథి పాత్రలో `గానగంధుర్వుడు` ఎస్పీ బాలసుబ్రమణ్యం తళుక్కున మెరిశారు.
మెలోడీబ్రహ్మ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. ``దాయి దాయి దామ్మా``, ``భం భం బోలే``, ``రాధే గోవిందా``, ``అమ్మడు అప్పచ్చి``, ``ఘల్లు ఘల్లు``, ``అయ్యో అయ్యో`` (ఈ పాటకి ఆర్పీ పట్నాయక్ సంగీతదర్శకుడు).. ఇలా ఇందులోని గీతాలన్ని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మరీ ముఖ్యంగా.. ``దాయి దాయి దామ్మా``లో చిరు వేసిన వీణ స్టెప్ అప్పట్లో ఓ సంచలనం.
ఇక అవార్డుల విషయానికి వస్తే.. `ఉత్తమ నటుడు` (`కింగ్` నాగార్జునతో కలిసి ఈ పురస్కారం పంచుకున్నారు చిరు), `ఉత్తమ నృత్యదర్శకుడు` (లారెన్స్ రాఘవ), `ఉత్తమ అనువాద కళాకారుడు` (పి. రవిశంకర్) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. `ఉత్తమ నటుడు`, `ఉత్తమ నృత్య దర్శకుడు` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను అందుకుందీ సెన్సేషనల్ మూవీ.
151 కేంద్రాలలో 50 రోజులు, 122 కేంద్రాలలో 100 రోజులు, 32 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శితమైన `ఇంద్ర`.. 2002 జూలై 24న విడుదలైంది. నేటితో ఈ సంచలన చిత్రం 19 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read