`క్రిష్`గా హృతిక్ రోషన్ మెస్మరైజ్ చేసి నేటికి 16 ఏళ్ళు!
on Jun 23, 2022
భారతీయ ప్రేక్షకులు మెచ్చిన సూపర్ హీరోల చిత్రాల్లో `క్రిష్` ఫ్రాంచైజీకి ప్రత్యేక స్థానముంది. `కోయి మిల్ గయా` (2003), `క్రిష్` (2006), `క్రిష్ 3` (2013).. ఇలా ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు రాగా అవన్ని కూడా సంచలనం సృష్టించాయి. మూడు చిత్రాలనూ స్టార్ డైరెక్టర్ రాకేశ్ రోషన్ తెరకెక్కించగా.. ఆయన తనయుడు, టాప్ స్టార్ హృతిక్ రోషన్ కథానాయకుడిగా మెస్మరైజ్ చేశారు.
ఇక నేటితో 16 వసంతాలు పూర్తిచేసుకుంటున్న `క్రిష్` విషయానికి వస్తే.. `కోయి మిల్ గయా`కి కొనసాగింపు కథగా ఈ సినిమా రూపొందింది. తండ్రి రోహిత్ మెహ్రా (హృతిక్) లాగే సూపర్ పవర్స్ ఉన్న `క్రిష్` (హృతిక్) చేసిన సాహసాలు, విన్యాసాలు చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఇందులో కథానాయికగా ప్రియాంక చోప్రా ఎంటర్టైన్ చేయగా రేఖ, నజీరుద్దీన్ షా, శరత్ సక్సేనా, అర్చనా పూరన్ సింగ్, పునీత్ ఇస్సార్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
రాజేష్ రోషన్ బాణీలు కట్టిన ఈ చిత్రంలో.. ``ప్యార్ కి ఏక్ కహానీ`` (తెలుగు వెర్షన్ లో ``కథ వింటావా``) చార్ట్ బస్టర్ గా నిలవగా, ``చోరీ చోరీ చుప్కే చుప్కే`` (తెలుగులో ``ఆ పైరగాలి``), ``దిల్ న దియా`` (తెలుగులో `గుండె ఆడినా``) కూడా సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. `బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్` విభాగంలో `నేషనల్ అవార్డ్` అందుకున్న `క్రిష్`.. `బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్`, `బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్`, `బెస్ట్ యాక్షన్` విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను దక్కించుకుంది. రాకేశ్ రోషన్ స్వయంగా నిర్మించిన `క్రిష్`.. 2006 జూన్ 23న విడుదలై ఆ యేటి మేటి గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. కాగా, త్వరలోనే `క్రిష్ 4` కూడా సెట్స్ పైకి వెళ్ళబోతోంది.