రాజమౌళి సెవెన్త్ వండర్ `మగధీర`కి 12 ఏళ్ళు!
on Jul 31, 2021

తెలుగునాట అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా, తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్దేశకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. పాత కథలనే ఎంచుకున్నా వాటిని సరికొత్త కోణంలో ఆవిష్కరించి విజయాలను అందుకోవడం జక్కన్నకి మెగాఫోన్ తో పెట్టిన విద్య. అలా.. తెలుగు సినిమాకి అచ్చొచ్చిన `పునర్జన్మ`ల ఫార్ములాని తనదైన శైలితో రాజమౌళి రూపొందించిన చిత్రం `మగధీర`. ఈ విజువల్ వండర్.. జక్కన్న ఏడో చిత్రం కావడం విశేషం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రాజమౌళి డైరెక్టోరియల్ `అంతకుమించి` ఆదరణతో అటు కేంద్రాల పరంగానూ, ఇటు వసూళ్ళపరంగానూ `ఇండస్ట్రీ హిట్`గా నిలిచింది. అలాగే రెండు జాతీయ పురస్కారాలను, తొమ్మిది నంది అవార్డులను, ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను కైవసం చేసుకుని.. రివార్డులు, రికార్డులతో పాటు అవార్డుల పరంగానూ సంచలనం సృష్టించింది.
ఇక `చిరుత`లా తెలుగు తెరపైకి దూసుకొచ్చిన చిరు తనయుడు రామ్ చరణ్ కి రెండో సినిమాతోనే మెమరబుల్ మూవీని అందించి మెగాపవర్ స్టార్ గా మలిచారు జక్కన్న. అలాగే, మెగాస్టార్ చిరంజీవిని అతిథి పాత్రలో నటింపజేసి.. తండ్రీతనయులను ఒకే ఫ్రేమ్ లో బంధించి మరీ మెగాభిమానులకు కనువిందు చేశారు. అదేవిధంగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ని స్టార్ గా నిలబెట్టారు.
కథ విషయానికి వస్తే.. తన రాజ్యంలో మహాయోధుడైన కాలభైరవ(రామ్ చరణ్)ని ప్రేమిస్తుంది యువరాణి మిత్రవింద (కాజల్). అయితే, మిత్రవిందపై కన్నేసిన రణదేవ్ బిల్లా (దేవ్ గిల్) పన్నిన కుట్ర కారణంగా ప్రేమికులిద్దరూ మరణిస్తారు. 400 ఏళ్ళ తరువాత హర్ష, ఇందుగా మళ్ళీ పుట్టిన కాలభైరవ, మిత్రవింద మరుజన్మలోనైనా ఒక్కటయ్యారా? లేదా? అన్నదే `మగధీర` చిత్రం.
సింపుల్ స్టోరీ లైన్ ని బ్యూటీఫుల్ విజువల్స్ తో, కలర్ ఫుల్ స్క్రీన్ ప్లేతో జక్కన్న తెరకెక్కించిన విధానమే `మగధీర`ని పునర్జన్మల చిత్రాల పరంగా ప్రత్యేకంగా నిలిపింది. స్వరవాణి కీరవాణి బాణీలు - నేపథ్యసంగీతం, సెంథిల్ కుమార్ కనువిందైన ఛాయాగ్రహణం, ఆర్.సి. కమలకన్నన్ స్పెషల్ ఎఫెక్ట్స్, అల్లు అరవింద్ నిర్మాణదక్షత.. వెరసి వెండితెరపై ఓ అద్భుతంగా నిలిచింది `మగధీర`. 2009 జూలై 31న విడుదలై అఖండ విజయం సాధించిన రాజమౌళి సెవన్త్ వండర్ `మగధీర`.. నేటితో 12 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



