రవితేజ `దరువు`కి పదేళ్ళు!
on May 25, 2022
మాస్ మహారాజా రవితేజ కొన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. వాటిలో `దరువు` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి `యముడికి మొగుడు`(1988) స్ఫూర్తితో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ కి `శౌర్యం` శివ దర్శకత్వం వహించగా.. నేటి అగ్ర దర్శకుల్లో ఒకరైన అనిల్ రావిపూడి సంభాషణలు సమకూర్చారు. ఇందులో బుల్లెట్ రాజాగా, హోమ్ మినిస్టర్ రవీంద్రగా రవితేజ రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకోగా.. తాప్సీ కథానాయికగా సందడి చేసింది. సీనియర్ యముడుగా సత్యనారాయణ, జూనియర్ యముడుగా ప్రభు, చిత్రగుప్తుడిగా ఎమ్మెస్ నారాయణ అలరించిన ఈ సినిమాలో జయసుధ, బ్రహ్మానందం, సాయాజీ షిండే, రఘుబాబు, సుశాంత్ సింగ్, గొల్లపూడి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఎల్బీ శ్రీరామ్, వెన్నెల కిశోర్, సన ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
విజయ్ ఆంటోని సంగీతమందించిన ఈ చిత్రంలో ``రాజుల``, ``ఉసుమలరసే``, ``నిజం చెప్పు``, ``సెక్సీ లేడీ`` తదితర గీతాలన్ని అలరించాయి. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మించిన `దరువు`.. 2012 మే 25న విడుదలై ఓ వర్గం ప్రేక్షకుల ఆదరణ పొందింది. నేటితో ఈ చిత్రం పదేళ్ళు పూర్తిచేసుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
