పదేళ్లు పూర్తి చేసుకున్న ట్రెండ్ సెట్టర్ 'స్వామిరారా'
on Mar 23, 2023

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాలు అరుదుగా ఉంటాయి. అందులోనూ, విజయాన్ని సాధించడమే కాకుండా కొత్త వారికి ధైర్యాన్ని ఇస్తూ ట్రెండ్ సెట్ చేసే సినిమాలు అత్యంత అరుదుగా వస్తాయి. అలాంటి సినిమాలలో ఒకటే 'స్వామిరారా'. నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పెద్దగా అంచనాల్లేకుండా 2013, మార్చి 23న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ ఫిల్మ్ నేటితో పది వసంతాలు పూర్తి చేసుకుంది.
2013 లో ఎక్కువగా కమర్షియల్ సినిమాల హవానే నడిచింది. ఆ సమయంలో కొత్త, పాత అనే తేడా లేకుండా దర్శకులంతా.. విభిన్న కథలు, ప్రయోగాల జోలికి పోకుండా కమర్షియల్ సినిమాలకే ఎక్కువ మొగ్గుచూపారు. అలాంటి సమయంలో 'స్వామిరారా' అనే క్రైమ్ కామెడీ చిత్రంతో సుధీర్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. పద్మనాభస్వామి గుడిలో చోరీకి గురైన అత్యంత మహిమ గల గణేష్ విగ్రహం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కథాంశం, కథనం కొత్తగా ఉండటం.. దానిని ఎంటర్టైనింగ్ గా చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువ నటీనటులతో ప్రేమకథలు మాత్రమే కాదు.. విభిన్న కథలు తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన చిత్రమిది. ఒక్క సినిమాతోనే ప్రతిభగల దర్శకుడిగా సుధీర్ వర్మ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా ఆయనకు ఆ తరువాత భారీ విజయాలు దక్కకపోయినా.. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ రవితేజ లాంటి స్టార్ తో 'రావణాసుర' సినిమా చేస్తున్నాడంటే 'స్వామిరారా' ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా నుంచే హీరో నిఖిల్ కథల ఎంపికలో మార్పు వచ్చింది. అప్పటిదాకా అందరిలా మూసధోరణిలో వెళ్లిన నిఖిల్.. 'స్వామిరారా' తరువాత నుంచి సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తున్నాడు. అలాగే ఇది కేవలం ఆ సినిమాకి పని చేసిన వారికి పేరు తీసుకురావడమే కాకుండా.. దర్శకత్వ ప్రయత్నాల్లో ఉన్న ఎందరో కొత్త దర్శకులకు విభిన్న కథాంశంతో సినిమా చేసినా ఆదరణ లభిస్తుందనే ధైర్యాన్ని ఇచ్చింది.
లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రంలో సత్య, పూజా రామచంద్రన్, జీవా, రవిబాబు తదితరులు నటించారు. సన్ని ఎం.ఆర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్ గా కార్తీక శ్రీనివాస్ వ్యవహరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



