మారుతి మ్యాజిక్ 'ప్రేమకథా చిత్రమ్'కి పదేళ్లు!
on Jun 7, 2023
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన చిత్రాలలో 'ప్రేమకథా చిత్రమ్' ఒకటి. 'ఈ రోజుల్లో', 'బస్టాప్' వంటి యూత్ ఫుల్ సినిమాలతో సంచలనం సృష్టించిన దర్శకుడు మారుతి నుంచి వచ్చిన మూడో సినిమా ఇది. అయితే ఈ సినిమాకి ఆయన దర్శకుడు కాదు. రచయితగా, నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. దీంతో ఇది మారుతి సినిమాగానే ప్రచారం పొందింది.
సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన ఈ చిత్రానికి జె.ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. ప్రవీణ్, సప్తగిరి ముఖ్యపాత్రలు పోషించారు. 2013 జూన్ 7 న విడుదలైన 'ప్రేమకథా చిత్రమ్' హర్రర్ కామెడీ చిత్రాలలో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది. ఆ సమయంలో ఈ సినిమా స్ఫూర్తితో పదుల సంఖ్యలో హర్రర్ కామెడీ చిత్రాలు వచ్చాయంటే.. ఎంతటి ప్రభావాన్ని చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో సప్తగిరి కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నందిని-సప్తగిరి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో చప్పట్లు కొట్టేలా చేశాయి. ఈ సినిమాతో సప్తగిరి ఒక్కసారిగా స్టార్ కమెడియన్ అయిపోయాడు. హర్రర్, కామెడీ సన్నివేశాలు మాత్రమే కాదు.. ఈ సినిమాలోని ప్రేమ సన్నివేశాలు కూడా మెప్పించాయి. అందుకే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొంది ఘన విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ సినిమా నేటితో పది వసంతాలు పూర్తి చేసుకుంది.
మారుతి టాకీస్, ఆర్.పి.ఏ. క్రియేషన్స్ పతాకాలపై దాసరి మారుతి, సుదర్శన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి జె.బి(జీవన్ బాబు) సంగీతాన్ని అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా జె. ప్రభాకర్ రెడ్డి, ఎడిటర్ గా ఎస్. బి. ఉద్దవ్ వ్యవహరించారు. ఈ చిత్రం విజయంలో జె.బి సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
