దేవ కట్టా కొత్త రాజకీయం!
on Jul 12, 2025
నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇద్దరూ దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే చంద్రబాబు ముందే ముఖ్యమంత్రి కాగా, వైఎస్సార్ మాత్రం ఆలస్యంగా అయ్యారు. స్నేహితులు కంటే కూడా.. రాజకీయ ప్రత్యర్థులుగానే వీరు ఎక్కవ మందికి తెలుసు. అలాంటిది వీరి స్నేహం నేపథ్యంలో ఒక సిరీస్ కి శ్రీకారం చుట్టారు ప్రముఖ దర్శకుడు దేవ కట్టా. మయసభ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సిరీస్ టీజర్ తాజాగా విడుదలైంది.
ఇద్దరు మంచి స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులు ఎలా అయ్యారు అనే పాయింట్ తో మయసభ తెరకెక్కింది. ఇందులో ఎన్టీఆర్ పాత్రను ఆర్సీఆర్ గా చూపించారు. పార్టీలో ఆర్సీఆర్ భార్య సుశీల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ 160 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసినట్లుగా టీజర్ ప్రారంభమైంది. అదే సమయంలో రెడ్డికి నాయుడు ఫోన్ చేసి సలహా అడిగినట్లుగా చూపించడం ఆసక్తికరంగా ఉంది. "ఇది చావో రేవో అర్థంకావట్లేదు రెడ్డి. స్నేహితుడిగా ఒక మాట చెప్పు .. ఈ ఉచ్చు నుంచి బయటపడతాను అంటావా?" అని నాయుడు అడగగా.. "ఈరోజు నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. ఆ బాణాన్ని నిన్ను ఓడించేవరకు వాడుతూనే ఉంటా" అని రెడ్డి చెప్తాడు. అలాగే "పిల్లనిచ్చిన మామతోనూ నీకోసం పోరాడుతున్నా" అని నాయుడు అనగా.. "ఫ్రెండ్ గా ఒక మాట చెప్పనా నాయుడు.. యుద్ధం నీ ధర్మం" అని రెడ్డి చెప్తాడు. రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో స్నేహితులిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్ళు అన్నట్టుగా టీజర్ చూపించారు. ఇక టీజర్ చివరిలో లారీలో వెళ్తున్న నాయుడు, రెడ్డి మధ్య జరిగే సంభాషణ బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. "అరక దున్నే కులంలో పుట్టినోడివి నీకెందుకు రాజకీయం" అని నాయుడిని రెడ్డి ఎగతాళి చేస్తాడు. దానికి కౌంటర్ అన్నట్టుగా "వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి.. నీకందుకు వైద్యం" అని నాయడు గట్టిగా నవ్వేస్తాడు. రెడ్డి కూడా నవ్వుతారు.
రాజకీయ నాయకుల గురించి సినిమా అంటే.. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చేసి చూపించడం జరుగుతుంటుంది. దాంతో విమర్శలు వస్తుంటాయి. అయితే మయసభ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. కాగా, ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
