‘విశ్వంభర’ను టార్గెట్ చేసిన చిరు.. రిలీజ్‌కి రెడీ చేస్తున్న మెగాస్టార్!
on Jan 15, 2026
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సంక్రాంతి హిట్స్ ఉన్నాయి. 47 ఏళ్ళ కెరీర్ తర్వాత కూడా ఈ సంక్రాంతికి కూడా మరో భారీ హిట్‌తో తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో చేసిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు
యాక్షన్ సినిమాలలో ఎంతటి పవర్ చూపిస్తారో కామెడీ టైమింగ్‌లో కూడా అదే పవర్‌ను చూపించడం మెగాస్టార్‌కి కొత్తేమీ కాదు. అలాంటి ఓ ఎంటర్‌టైనర్‌తో ఈ సంక్రాంతికి సందడి చేస్తున్నారు మెగాస్టార్. భారీ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ భారీ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ను థియేటర్లలోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు చిరు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా గ్రాఫిక్స్‌వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న ఈ సినిమాను పూర్తి చేయించేందుకు నడుం కట్టారు చిరు. బాబీ కాంబినేషన్‌లో చెయ్యాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతుండడంతో ఆ సమయాన్ని ‘విశ్వంభర’ కోసం కేటాయిస్తున్నారు చిరు. తనే దగ్గరుండి వీఎఫ్‌ఎక్స్ పనులను పర్యవేక్షిస్తూ, టెక్నికల్ టీమ్‌కు తగిన సూచనలు ఇవ్వబోతున్నారు.
ఫైనల్ ఔట్‌పుట్‌ను చెక్ చేసి అంతా సంతృప్తికరంగా వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చెయ్యాలని చిరు డిసైడ్ అయ్యారు. యువి క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. గ్రాఫిక్ వర్క్ వీలైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే ఈ విజువల్ వండర్‌ను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మెగాస్టార్ కృషి చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



