డిజాస్టర్ వచ్చినా తగ్గేదేలే.. క్రేజీ ప్రాజెక్ట్స్ తో వస్తున్న కిరణ్ అబ్బవరం!
on Nov 24, 2022
టాలీవుడ్ లో వేగంగా సినిమాలు చేస్తున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ముందు వరుసలో ఉంటాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది మూడు సినిమాలను విడుదల చేసి మిశ్రమ ఫలితాలు అందుకున్న ఈ యువ హీరో వచ్చే ఏడాది లెక్క సరి చేయాలని చూస్తున్నాడు.
2019లో వచ్చిన 'రాజా వారు రాణి గారు'తో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కిరణ్. ఈ సినిమా మంచి హిట్ అయింది. తన నటనతో యువతను ఆకట్టుకున్నాడు. తర్వాత 2021లో 'ఎస్.ఆర్. కల్యాణ మండపం'తో సూపర్ హిట్ అందుకొని మరింతమందికి చేరువయ్యాడు. 2022లో 'సెబాస్టియన్ పిసి 524', 'సమ్మతమే', 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' వంటి మూడు విభిన్న తరహా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో 'సమ్మతమే' మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిగతా రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ముఖ్యంగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' డిజాస్టర్‌గా నిలిచి అతని కెరీర్‌లో కుదుపును సృష్టించింది.
అతని చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుతం కిరణ్ చేతిలో మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్, ఏఎమ్ రత్నం & ఏషియన్ సినిమాస్ వంటి బడా బ్యానర్స్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 2023 సంత్సరంలో ఫుల్ బిజీగా వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టాడు ఈ యంగ్ హీరో. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17, 2023న విడుదలకు షెడ్యూల్ చేయబడిన 'వినరో భాగ్యము విష్ణు కథ'పై అందరి దృష్టి ఉండగా, దీని తర్వాత 'మీటర్', 'రూల్స్ రంజన్' సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది కిరణ్ విజయాలను అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
