కన్నప్ప ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తారు..?
on Jun 26, 2025
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన చిత్రం 'కన్నప్ప' (Kannappa). మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. భక్త కన్నప్ప కథతో తెరకెక్కడం, పలువురు స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో.. కన్నప్పపై మొదటి నుంచి ప్రేక్షకుల దృష్టి ఉంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. దాంతో రేపు(జూన్ 27) థియేటర్లలో అడుగుపెట్టనున్న కన్నప్ప.. ఏ స్థాయిలో మెప్పిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
కొందరు సినీ ప్రముఖులు, నేషనల్ మీడియా వారు కన్నప్ప చిత్రాన్ని ఇప్పటికే ప్రత్యేకంగా వీక్షించారు. కన్నప్ప సినిమాని చూసిన వారంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినప్పటికీ.. కథలోకి వెళ్లేకొద్దీ ప్రేక్షకులు పూర్తిగా లీనమైపోతారట.
దేవుడిపై నమ్మకం లేని తిన్నడు.. గొప్ప శివ భక్తుడు కన్నప్పగా మారే సన్నివేశాలు కట్టిపడేశాయని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో నెమ్మదిగా కథలోకి తీసుకెళ్తూ.. ఇంటర్వెల్ బ్లాక్ కి గూస్ బంప్స్ వచ్చేలా మలిచారట. ప్రభాస్ సీక్వెన్స్, మోహన్ లాల్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయట. ఇక క్లైమాక్స్ అయితే మరో స్థాయిలో ఉందని అంటున్నారు. సినిమా అంతా ఒకెత్తయితే, చివరి 40 నిమిషాలు మరో ఎత్తని చెప్తున్నారు. కాంతార క్లైమాక్స్ కి ఎంతటి పేరు వచ్చిందో.. కన్నప్ప క్లైమాక్స్ కి కూడా అంతటి పేరు వస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి.
కన్నప్ప పాత్రలో విష్ణు చక్కగా ఒదిగిపోయాడని, ముఖ్యంగా క్లైమాక్స్ లో తన పర్ఫామెన్స్ తో సర్ ప్రైజ్ చేశాడని ప్రశంసిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తో కలిసి విష్ణు కనిపించే సన్నివేశాలు కనువిందు చేస్తాయని అంటున్నారు.
భక్త కన్నప్ప కథ కావడంతో ఈ సినిమా చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. పైగా ప్రభాస్ కీలక పాత్ర పోషించడంతో ఆయన ఫ్యాన్స్ కన్నప్పను భుజానికెత్తుకొనే అవకాశముంది. అదే జరిగితే అదిరిపోయే వసూళ్లు రాబడుతుంది అనడంలో సందేహం లేదు. ఇక నార్త్ లోనూ డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంటుంది. అక్కడి మీడియా విడుదలకు ముందే ఈ సినిమాను ప్రశంసిస్తోంది. చూస్తుంటే నార్త్ లోనూ కన్నప్ప మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
