'కబ్జా' మూవీ రివ్యూ
on Mar 17, 2023
సినిమా పేరు: కబ్జా
తారాగణం: ఉపేంద్ర, శ్రియ శరణ్, కిచ్చా సుదీప్, మురళీ శర్మ, సుధ, అనూప్ రేవణ్ణ, కబీర్ దుహాన్ సింగ్, జాన్ కొక్కేన్, దేవ్ గిల్, డానిష్ అఖ్తర్, కామరాజన్, నవాబ్ షా, పోసాని కృష్ణమురళి, కోట శ్రీనివాసరావు, శివ రాజ్‌కుమర్ (గెస్ట్ అప్పీరెన్స్)
డైలాగ్: చంద్రమౌళి
మ్యూజిక్: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: ఎ.జె. శెట్టి
ఎడిటింగ్: మహేశ్ ఎస్. రెడ్డి
ప్రొడక్షన్ డిజైన్: జె. శివకుమార్
యాక్షన్: కె. రవివర్మ, విజయ్, చేతన్ డిసౌజా, వినోద్, విక్రం మోర్, థ్రిల్లర్ మంజు
కొరియోగ్రఫీ: చిన్ని ప్రకాశ్, జాని, కాలై, మురళి
నిర్మాత, దర్శకుడు: ఆర్. చంద్రు
బేనర్స్: ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్, ఇన్వీనియో ఆరిజిన్
విడుదల తేదీ: 17 మార్చి 2023
'కేజీఎఫ్' సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడంతో కన్నడ సినిమాకు మార్కెట్ పెరిగిపోయింది. 'కాంతార' విజయం ఆ ఇండస్ట్రీకి మరింత ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర హీరోగా నటించిన 'కబ్జా' సినిమా మన ముందుకు వచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు 'కేజీఎఫ్' ప్రభావంతో ఈ సినిమాని డైరెక్టర్ ఆర్. చంద్రు రూపొందించాడనే అభిప్రాయం కలిగింది. సినిమా నిజంగా ఎలా ఉందంటే...
కథ
'కబ్జా' కథ అమరపుర అనే ఒక కల్పిత ప్రాంతంలో జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని కబ్జా చేయడానికి చాలామంది అండర్‌వరల్డ్ డాన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. ఎలక్షన్స్‌లో నిల్చొని గెలిస్తే ఆ ఏరియాను ఏలవచ్చని వీర బహద్దూర్ (మురళీశర్మ), గ్యాంగ్‌స్టర్ ఖాలిద్ అనుకుంటారు. వీర బహద్దూర్‌పై నిలబెట్టడానికి దుబాయ్‌లో ఉన్న తన కొడుకును రప్పిస్తాడు ఖాలిద్. అయితే అతడు అమరపురకు అడుగుపెట్టడంతోనే ఒక మహిళను తుపాకీతో కాల్చి, తమనెవరూ అడిగేవాడు ఆ ప్రాంతంలో లేదని రంకెలేస్తాడు. కానీ వాణ్ణి సంకేశ్వర్ తలపై తుపాకీతో కాల్చేస్తాడు. దాంతో పట్టలేని పగతో రగిలిపోయిన ఖాలిద్ అతడి తల నరికేస్తాడు. అంత దాకా పిరికివాడుగా ముద్రపడిన అర్కేశ్వర్ (ఉపేంద్ర).. తన అన్న సంకేశ్వర్ హత్యకు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, ఆ క్రమంలో ఎలా మాఫియా కింగ్‌పిన్‌గా ఎదిగాడన్నది మిగతా కథ. ఈ మధ్యలో వీర బహద్దూర్ కూతురు మధుమతితో అతడి ప్రేమాయణం, పెళ్లి లాంటివి కూడా మనం చూస్తాం.
విశ్లేషణ
పోలీసాఫీసర్ భాస్కర్ బక్షి (సుదీప్) ఒక ఏరియాలోని రౌడీ షీటర్లను అందర్నీ సమావేశపరిచి, అర్కేశ్వర్ 'కబ్జా' కథ చెప్పడం మొదలుపెడతాడు. 'కేజీఎఫ్' ఘన విజయం వెనుక ఆ సినిమాకి ప్రశాంత్ నీల్ రాసుకున్న స్క్రీన్‌ప్లే, హీరోకు సంబంధించిన అమ్మ సెంటిమెంట్ కీలకంగా మారాయి. అందుకే అందులో ఎంత హింస ఉన్నా జనం దాన్ని ఆదరించారు. 'కేజీఎఫ్' తరహాలోనే ఒక హింసాత్మక యాక్షన్ థ్రిల్లర్‌ను తియ్యాలని డైరెక్టర్ ఆర్. చంద్రు ప్రయత్నించినట్లు అర్థమైపోతుంది. ఈ సినిమాలోనూ ఒక అమ్మ (సుధ) ఉంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సంకేశ్వర్ ధైర్య సాహసాలు కలిగిన వాడైతే, చిన్నవాడు అర్కేశ్వర్ మెతకవాడు, రక్తాన్ని చూస్తేనే భయపడిపోయేవాడు. ఈ సినిమాలోనూ అమ్మ అనే పాత్రను సెంటిమెంట్ కింద ఉపయోగించుకోవాలని దర్శకుడు భావించినా, అందుకు తగ్గ బలమైన సన్నివేశాలు అమ్మ పాత్రకు పడలేదు.
'కబ్జా'లో 'కేజీఎఫ్'కు మించిన హింస, రక్తపాతాన్ని మనం చూస్తాం. గన్ ఫైరింగ్‌లు, కత్తులతో నరకటాలు, పదుల సంఖ్యలో కార్ల కవాతులు సినిమా అంతా చెలరేగిపోతుంటాయి. కానీ కథలో ప్రేక్షకుల హృదయాల్ని కట్టిపడేసే ఆత్మలాంటి పదార్థం ఏమిటి? అదెక్కడుంది?.. అని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అసలు ఈ హింస ఎందుకు? కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ను రాకీ భాయ్ హస్తగతం చేసే తీరును అక్కడ ('కేజీఎఫ్'లో) దర్శకుడు ఉత్కంఠభరితంగా తీస్తే, ఇక్కడ అమరపురను అర్కేశ్వర్ 'కబ్జా' చేసే విధానాన్ని ఒక పద్ధతి లేకుండా విశృంఖలంగా తీసుకుంటూ పోయాడు దర్శకుడు. రెండింటికీ హస్తిమశకాంతరం (ఏనుగుకూ, దోమకూ మధ్య ఉన్న అంతరం) అంత తేడా ఉంది. ఎక్కడో యూరప్‌లో సెటిలైన ఢాకా అనే మాఫియా డాన్ కింద పనిచేసే ఖాలిద్, భంగీర, మాలిక్ అనే గ్యాంగ్‌స్టర్స్‌తో ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారిన అర్కేశ్వర్ సాగించే మారణహోమం, ఏరుల్లా పారించే రక్తం చూస్తుంటే.. ఒళ్లు ఉద్వేగంతో జలదరించడానికి బదులు ఏవగింపుతో జలదరిస్తుంది. పైగా ఇదంతా తొలిభాగం వరకే. 'కబ్జా 2' ఉందని క్లైమాక్స్‌లో చెప్పి, మరింత భయపెట్టాడు దర్శకుడు చంద్రు. ఢాకాగా చివరలో శివ రాజ్‌కుమార్ దర్శనమిస్తాడు (విక్రం మూవీలో రోలెక్స్ క్యారెక్టర్‌లో సూర్య కనిపించడం గుర్తుకు రాక మానదు.) ఈ సినిమాని చూస్తే నిర్మాతలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని తెలుస్తుంది. కానీ ఆ డబ్బు కలెక్షన్ల రూపంలో తిరిగొస్తుందా అనేది పెద్ద డౌటు.
టెక్నికల్‌గా 'కబ్జా' హై స్టాండర్డ్స్‌లోనే ఉంది. 'కేజీఎఫ్'తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన రవి బస్రూర్ ఈ సినిమాకీ మ్యూజిక్ ఇచ్చాడు. అతని బ్యాగ్రౌండ్ స్కోర్‌తో హింసాత్మక సన్నివేశాలు మరింత గుండెదడ పుట్టించాయి. పాటలు ఇచ్చిన బాణీలు బాగున్నాయి. ఎ.జె. సెట్టి సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్‌లో ఉంది. 1945 కాలం నుంచి 1970ల కాలం దాకా సాగే ఈ సినిమా కథకు తగ్గ కలర్ టోన్‌తో కెమెరా బాగా పనితనం చూపించింది. దర్శకుడు చంద్రు ఇచ్చిన హింసాత్మక సన్నివేశాల్ని క్రిస్పీ ఎడిటింగ్‌తో ఆసక్తికరంగా ఎలా అతికించాలో అర్థం కానట్లు ఎడిటింగ్ చేశాడు మహేశ్‌రెడ్డి. యాక్షన్ సీన్లు బీభత్సంగా ఉన్నాయి. ముఖ్యంగా ఖాలిద్‌తో అర్కేశ్వర్ తలపడేటప్పుడు, ఆ తర్వాత అతడిని తన బైక్ మీద పెట్టుకొని అర్కేశ్వర్ వెళ్లేప్పుడు, ఆపైన అతడి తల నరికేటప్పుడు భయానకమైన వాతావరణాన్ని మనం ఫీలవుతాం.
నటీనటుల పనితీరు
'కబ్జా' అనేది ఉపేంద్ర సినిమా. అర్కేశ్వర్‌గా చెలరేగిపోయి నటించాడు. అయితే ఇలాంటి కథతో తను సినిమా చేయడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో ఆయన ఆలోచించుకొని ఉండాల్సింది. యువరాణి మధుమతిగా శ్రియా శరణ్ అతికినట్లు సరిపోయింది. తల్లి పాత్రలో సుధ రాణించారు. వీర బహద్దూర్ పాత్రలో మురళీ శర్మ నటన ఎలా ఉండి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా! పోలీసాఫీసర్ భాస్కర్ బక్షిగా సుదీప్ కొద్దిసేపు కనిపించాడు. గ్యాంగ్‌స్టర్స్‌గా నవాబ్ షా, జాన్ కొక్కేన్, కబీర్ దుహాన్ సింగ్ లాంటి వాళ్లు నటించారు. తాన్యా హోప్ స్పెషల్ సాంగ్ చేసింది. కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి చేసిన పాత్రలు ఏమిటో, ఇలా కనిపించి అలా ఎందుకు మాయమవుతారో అర్థం కాదు. ఢాకా పాత్రలో శివ రాజ్‌కుమార్ మెరిశారు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
'కబ్జా' అనేది 'కేజీఫ్' తరహాలో రావాలని భంగపడ్డ ఒక అడ్డూ ఆపూలేని రక్తపాత సన్నివేశాలతో నిండిన సినిమా. యాక్షన్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్లు సైతం గగుర్పాటుతో భయపడే ఈ సినిమాని మిగతా జానర్ సినీప్రియులు అసలు జీర్ణం చేసుకుంటారా?
రేటింగ్: 1.5/5
- బుద్ధి యజ్ఞమూర్తి

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
