దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ
on Jun 7, 2025
వెబ్ సిరీస్ : దేవిక & డానీ
నటీనటులు: రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు, అభినయశ్రీ, సోనియా సింగ్, షణ్ముఖ్, రామరాజు, రజిత, శివన్నారాయణ తదితరులు
ఎడిటింగ్: కార్తికేయన్
మ్యూజిక్: జై క్రిష్
సినిమాటోగ్రఫీ: వెంకట్ దిలీప్
నిర్మాతలు: చాగంటి సుధాకర్
దర్శకత్వం: కిశోర్
ఓటీటీ: జియో హాట్ స్టార్
కథ:
దేవిక (రీతూ వర్మ) సంప్రదాయ బద్ధమైన కుటుంబానికి చెందిన యువతి. ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామీణ ప్రాంతంలో ఆమె కుటుంబం నివసిస్తూ ఉంటుంది. ఆమె తల్లి కౌసల్య .. (రజిత) తండ్రి స్వామినందన్ (శివన్నారాయణ). ఆమె తాతయ్య యోగి నందన్ (రామరాజు)కి కొన్ని శక్తులు ఉంటాయి. ఆయనకి చనిపోయినవారి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి. దేవిక ఒక స్కూల్లో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజూ బస్సులో ఆ స్కూల్ కి వెళ్లి వస్తూ ఉంటుంది. దేవికకి జగ్గీ (సుబ్బరాజు)తో నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి ముహూర్తం 3 నెలల వరకూ లేకపోవడంతో, అప్పటివరకూ వెయిట్ చేయవలసి వస్తుంది. ఒక రోజున ఆమె దగ్గరికి డానీ (సూర్య వశిష్ఠ) వచ్చి పరిచయం చేసుకుంటాడు. తాను చూస్తున్నది అతని ఆత్మననీ .. అతను చనిపోయి కొంతకాలమైందని తెలుసుకుని దేవిక షాక్ అవుతుంది. తన వలన 'గాయత్రి' కుటుంబానికి అన్యాయం జరిగిందనీ, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి గాను తనకి సహకరించమని డానీ ఆత్మ కోరుతుంది. గాయత్రి ఎవరు? ఆమెకి డానీ చేసిన అన్యాయం ఎలాంటిది? జగ్గీతో నిశ్చితార్థం చేసుకున్న దేవిక, నిజంగానే వేరొకరితో లవ్ లో పడుతుందా అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే
విశ్లేషణ:
ఇది ఓ మధ్యతరగతి కుటుంబంలోని అమ్మాయి కథ. తన లైఫ్ లో జరిగే కొన్ని సంఘటనలకి వాస్తవ రూపాన్నిచ్చిన ఈ సిరీస్ మొత్తంగా ఏడు ఎపిసోడ్ లు ఉంది. ఒక్కో ఎపిసోడ్ ఇరవై ఎనిమిది నిమిషాలు ఉంది. మొదటి ఎపిసోడ్ చూసిన వెంటనే తర్వాత ఏం జరుగుతుందో చెప్పేయొచ్చు. అలా సాదాసీదాగా కథ సాగుతుంది. అయితే దేవికగా రీతూ వర్మ నటన సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచింది.
ఈ సిరీస్ చూస్తున్నప్పుడు ఇప్పటివరకు చూసిన రెండు సినిమాలు గుర్తొస్తాయి. వాటి నుండి ఇన్ స్పైర్ అయ్యారేమోనని ఆ సీన్లని చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ప్రేక్షకులకి సూర్య వశిష్ట కాస్త కొత్తగా అనిపించినా నటన పరంగా ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ లో రీతూ వర్మ తర్వాత డానీ పాత్రని చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా డానీ గతాన్ని రివీల్ చేసే తీరు ప్రేక్షకుడిని హత్తుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సీనియర్ నటి కోవై సరళ కనిపించి సర్ ప్రైజ్ చేస్తారు. సీరియస్ రోల్లో ఆకట్టుకుంటారు. డానీ చెప్పిన పని పూర్తి చేసేందుకు దేవిక చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. ఆమెకు సాయం చేసే సుబ్బు పాత్ర నవ్వులు పంచుతుంది. విలన్ గ్యాంగ్ ఎదురెళ్లిన వీరిద్దరూ అసలు ప్రాణాలతో బయటపడతారా లేదా అనే క్యూరియాసిటీ బాగుంది. అయితే అది చివరి వరకు కొనసాగించలేకపోయాడు దర్శకుడు.
మొదటి ఎపిసోడ్ క్యారెక్టర్లని పరిచయం చేసిన దర్శకుడు, తర్వాతి మూడు ఎపిసోడ్ లలో కథని సామాన్యుడు ఊహించే విధంగా చూపించాడు. అయితే చివరి మూడు ఎపిసోడ్ లు కాస్త బాగుంటాయి. కాబోయే భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకొస్తానని తండ్రితో సవాలు చేసిన జగ్గీ చివరకు గెలిచాడా లేదా అన్న కోణంలో చివరి ఎపిసోడ్లలో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంది. అయితే, కొన్ని చోట్ల సీరియస్ వ్యవహారంలో కామెడీ జోడించడంతో అప్పటివరకు ఎంగేజింగ్ గా సాగినా ఆ తర్వాత తేలిపోయింది. కమెడియన్ వైవా హర్ష, సోనియా సింగ్ లాంటి వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. క్లైమాక్స్ లో నటి దివి అతిథి పాత్రలో మెరుస్తుంది. 'దేవిక అండ్ డానీ' సీజన్ 2 ఉందని ఆ క్యారెక్టర్ తోనే తెలుస్తుంది. దేవిక తాత పాత్రని అక్కడక్కడ పవర్ఫుల్ గా చూపించి ఆసక్తి రేకెత్తించారు కానీ దానిని పూర్తిస్థాయిలో చూపించలేదు.
జై క్రిష్ మ్యూజిక్ ఓకే. కార్తికేయన్ ఎడిటింగ్ పర్వాలేదు. వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
దేవిక పాత్రలో రీతూ వర్మ ఒదిగిపోయింది. డానీ పాత్రలో సూర్య వశిష్ట, జగ్గీగా సుబ్బరాజు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : కొత్తదనం లేని కథ.. ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్.
రేటింగ్ : 2.5/ 5
✍️. దాసరి మల్లేష్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
