'బాలయ్య' సినిమాతో 'భావన' రీఎంట్రీ!
on Nov 3, 2021

మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న భావన.. తెలుగులో మాత్రం రాణించలేకపోయింది. తెలుగులో నటించిన మూడు సినిమాలూ పరాజయం పాలు కావడంతో టాలీవుడ్ కి దూరమైన ఆమె.. దశాబ్దం తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని న్యూస్ వినిపిస్తోంది.
గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'ఒంటరి(2008)' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది భావన. తెలుగులో మొదటి సినిమాతో పరాజయం మూటగట్టుకున్న ఆమె.. ఆ తర్వాత నితిన్ తో కలిసి 'హీరో(2008)' సినిమాలో నటించగా అది కూడా పరాజయం పాలైంది. అనంతరం కృష్ణవంశీ-శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 'మహాత్మ(2009)' సినిమాలో నటించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం విజయం సాధించలేకపోయింది. ఇలా తెలుగులో చేసిన మూడు సినిమాలతోనూ సరైన సక్సెస్ అందుకోలేకపోయిన భావన.. 2012లో వచ్చిన రవితేజ సినిమా 'నిప్పు'లో గెస్ట్ రోల్ లో తళుక్కున మెరిసి.. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించడమే మానేసింది. అప్పటినుంచి కన్నడ, మలయాళ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్న ఈ భామ.. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాతో టాలీవుడ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న 'అఖండ' తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం భావనను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రీఎంట్రీతో అయినా భావన తెలుగులో రాణిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



