'భీమ్లా నాయక్' రీషూట్.. 'ఆర్ఆర్ఆర్'కు రూట్ క్లియర్!
on Nov 24, 2021
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్ గా రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే సమయంలో జనవరి7న 'ఆర్ఆర్ఆర్', జనవరి 14న 'రాధేశ్యామ్' సినిమాలు విడుదలవుతుండటంతో.. 'భీమ్లా నాయక్' వాయిదా పడే అవకాశముందని మొదట ప్రచారం జరిగింది. అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ మాత్రం చెప్పిన టైంకే 'భీమ్లా నాయక్' విడుదలవుతుందని.. జనవరి 12న వచ్చి హిట్ కొట్టబోతున్నామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం పవన్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ తగిలే అవకాశముంది. రీషూట్ కారణంగా 'భీమ్లా నాయక్' వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది.
'భీమ్లా నాయక్'పై పవన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అంచనాలను ఆకాశాన్ని అంటేలా చేశాయి. అయితే ఈ సినిమా ఏ మాత్రం అటూయిటైనా ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతారని భావించిన పవన్.. ఈ మూవీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. అదే ఇప్పుడు భీమ్లా నాయక్ విడుదలకు బ్రేక్ లు పడేలా చేస్తుందని వార్తలొస్తున్నాయి. ఇటీవల పవన్ ఈ సినిమా ఔట్ పుట్ చూసారట. అయితే ఔట్ పుట్ చూసి డిజప్పాయింట్ అయిన పవన్.. పలు సన్నివేశాలను రీషూట్ చేయాలని దర్శకనిర్మాతలకు చెప్పారట. దీంతో మూవీ టీమ్ ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమైందని తెలుస్తోంది.
రీషూట్ వార్త నిజమైతే మాత్రం 'భీమ్లా నాయక్' జనవరిలో విడుదల కావడం కష్టమనే చెప్పాలి. ఎంత తొందరపడినా ఈ 40 రోజుల్లో రీషూట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలంటే సాధ్యమయ్యే పనికాదు. అదీగాక ఈ సినిమాకి స్టార్ కాస్ట్, బిగ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. వారంతా ఇప్పటికిప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేసుకొని రీషూట్ లో పాల్గొనడం కష్టమే. ఇదంతా చూస్తుంటే 'భీమ్లా నాయక్' వాయిదా పడటం ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే సోలోగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాలనుకుంటున్న 'ఆర్ఆర్ఆర్'కు రూట్ క్లియర్ అయినట్లే. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ రీషూట్ వార్త నిజం కాకూడదని కోరుకుంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
