లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీ, కమల్ మల్టీస్టారర్!
on Jul 19, 2022

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'విక్రమ్' సినిమా గత నెలలో విడుదలై కోలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు కమల్ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. చాలా కాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న కమల్ 'విక్రమ్' ఇచ్చిన జోష్ తో లోకేష్ తో మరో సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో రజినీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని తెలుస్తోంది.
నిజానికి కమల్ నిర్మాణంలో రజినీ, లోకేష్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ పక్కకెళ్లి 'విక్రమ్' వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో కమల్ ఉన్నాడట. 'విక్రమ్'లో కమల్ తో కలిసి ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య స్క్రీన్ పంచుకున్నట్లు.. ఇందులో రజినీ, కమల్ స్క్రీన్ పంచుకోనున్నారని తెలుస్తోంది. రజినీ, కమల్ ఎంతటి స్టార్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ ఇద్దరూ కలిస్తే ఎలాంటి రికార్డులు అయినా బ్రేక్ అవుతాయి. పైగా లోకేష్ డైరెక్టర్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతాయి.
ప్రస్తుతం లోకేష్.. విజయ్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీ, మహేష్ నారాయణ్ డైరెక్షన్ లో కమల్ సినిమాలున్నాయి. వాటి తర్వాత ఈ ముగ్గురి కాంబోలో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది. మరోవైపు 'ఖైదీ-2', 'విక్రమ్-2' తీసే ఆలోచనలో ఉన్న లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ లో దీనిని కూడా లింక్ చేస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



