బ్రహ్మీ.. ఇప్పుడు మేల్కొన్నాడా?
on Feb 1, 2016
.jpg)
వేయి చిత్రాల రారాజు బ్రహ్మానందం. హీరో ఎవరైనా సరే.. బ్రహ్మానందం ఉండాల్సింది. దర్శకుడెవరైనా సరే బ్రహ్మీ కోసం ఓ పాత్ర సృష్టించాల్సిందే. ఆరేంజులో సాగింది బ్రహ్మానందం ప్రభంజనం. కొన్ని సినిమాలు కేవలం బ్రహ్మానందం వల్లే ఆడాయి.. అన్నంత క్రేజ్ దక్కించుకొన్నారు. ఆ మాట నిజం కూడా. సెకండాఫ్‌లో బ్రహ్మానందం విజృంభణ మూలంగానే.. కొన్ని హిట్ సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. అయితే గత కొంత కాలంగా బ్రహ్మానందం క్రేజ్ మసకబారుతూ వస్తోంది. ఆయనపై విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. పారితోషికం పెంచేశాడని, నిర్మాతల్ని ఇబ్బంది పెడుతున్నారని గోల చేశారు. తోటి కమెడియన్లని తొక్కేస్తున్నాడని, కొంతమంది దర్శకులు, నిర్మాతలు కావాలనే బ్రహ్మానందాన్ని తప్పిస్తున్నారన్న గుసగుసలు వినిపించాయి. దాంతో బ్రహ్మానందం అలెర్ట్ అయ్యాడు. పారితోషికం తనకు ముఖ్యం కాదని, తోటి హాస్యనటుల్ని తానెంతో ప్రోత్సహించానని.. చెప్పుకొచ్చాడు. సినిమాలు తగ్గలేదని, తానే తగ్గించుకొన్నానన్న సంకేతాలు పంపాడు.
నిజంగానే బ్రహ్మానందం ఆలోచన దృక్పథం మారుతూ వస్తోంది. చాలా సినిమాల్ని కావాలనే వదులుకొన్నాడు. మంచి పాత్రలిస్తేనే చేస్తా - హాస్యం పేరుతో నాతో వెకిలి వేషాలు వేయించొద్దు.. అంటున్నాడట. బ్రహ్మానందం కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏం లేదు. అన్ని రకాల పాత్రలూ చేసేశాడు కూడా. అందుకే.. ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుదామనుకొంటున్నాడట. రిటైర్‌మెంట్ తీసుకోకపోయినా.. మంచి పాత్రలతోనే మెప్పిస్తా అంటున్నాడు. పోనీలెండి.. బ్రహ్మనందం ఇప్పటికైనా మేల్కొన్నాడు. కొత్తవారికి దారిస్తున్నాడు. పారితోషికం విషయంలోనూ కాస్త పెద్ద మనసు చూపిస్తే... చిన్న నిర్మాతల్ని ప్రొత్సహించినట్టుంటుంది. మరి బ్రహ్మానందం ఈ దిశగా ఎప్పుడు ఆలోచిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



