ENGLISH | TELUGU  
Home  » Gossips

లవర్‌బోయ్‌గా మాస్‌ని ఆకట్టుకుంటా: మానస్‌

on Nov 17, 2014

చిన్న వయసులోనే ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా దాదాపు 10కి పైగా చిత్రాల్లో నటించిన మానస్‌ ఇటీవల ‘ఝలక్‌, గ్రీన్‌సిగ్నల్‌’ చిత్రాల్లో యువహీరోగా నటించి ప్రేక్షకుల మనసుల్లో లవర్‌బోయ్‌గా ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యువహీరో నటిస్తున్న చిత్రం ‘కాయ్‌ రాజా కాయ్‌’. మారుతి దగ్గర దర్శకత్వశాఖలో పనిచేసిన శివగణేష్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మారుతి టాకీస్‌ బ్యానర్‌లో ఫుల్‌మూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వి.సతీష్‌రాజు సమర్పిస్తున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యువ హీరో మానస్‌తో జరిపిన ఇంటర్వూయ్...

బెస్ట్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్ని సినిమాల్లో నటించారు?

‘నరసింహనాయుడు, వీడే, అర్జున్‌, హీరో, పాండవులు’... ఇలా దాదాపు 10కి పైగా చిత్రాల్లో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాను. గతంలో సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వం వహించిన ‘హీరో’ చిత్రానికి బెస్ట్‌ చిల్డ్రన్స్‌ ఫిలింగా నంది అవార్డు రావడమే కాకుండా ఆ చిత్రంలో నటించినందుకు నాకు బెస్ట్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు వచ్చింది. అలాగే అదే సంవత్సరంలో మా టీవి వారు నిర్వహించిన సినిమా అవార్డ్స్‌లో బెస్ట్‌ ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అవార్డు వచ్చింది. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వున్నప్పుడు ఇంకా చాలా అవార్డులొచ్చాయి.

హీరోగా మీకు ‘కాయ్‌ రాజా కాయ్‌’ ఎన్నో చిత్రం?


ఇంతకుముందు ‘ఝలక్‌, గ్రీన్‌సిగ్నల్‌’ చిత్రాల్లో హీరోగా నటించాను. హీరోగా నా మూడో చిత్రం ‘కాయ్‌ రాజా కాయ్‌’.

సినిమాలపై ఇంట్రెస్ట్‌ కలగడానికి ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?

చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. మెగాస్టార్‌ చిరంజీవి గారి డ్యాన్స్‌ చూసి ఇన్‌స్పైర్‌ అయ్యేవాడిని. చిరంజీవి గారు చేసే డ్యాన్స్‌ కోసం ఆయన నటించిన ప్రతీ చిత్రాన్ని చూసేవాడిని. ముఖ్యంగా ‘చూడాలనివుంది’ చిత్రంలోని ‘రామ్మాచిలకమ్మ’ పాటకు చిరంజీవి గారు వేసిన డ్యాన్స్‌ని ఇంట్లో చేయడం మా పేరెంట్స్‌ చూసారు. ఆ తర్వాత మా పేరెంట్స్‌ అనుమతితో నటనకు, డ్యాన్స్‌కు తగిన శిక్షణ తీసుకోవడం జరిగింది.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా నటించడానికి గల కారణం?

మారుతి గారి శిష్యుడు శివగణేష్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముందుగా శివ ఈ చిత్రం స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాక కథ డిమాండ్స్‌ మేరకు ఇందులో ఇద్దరు హీరోలు కావాలి. ఒక హీరో రామ్‌ ఖన్నాని తీసుకున్నారు. ఇంకొక హీరో ఎవరైతే కథకి యాప్ట్‌ అవుతారా అని అనుకుంటున్న తరుణంలో మానస్‌ అయితే ఈ కథకి కరెక్ట్‌గా సరిపోతాడు. మంచి పెర్ఫామర్‌... అని ‘గ్రీన్‌ సిగ్నల్‌’ చిత్ర దర్శకుడు విజయ్‌ గారు నా పేరుని రిఫర్‌ చేసారు. ఆ తర్వాత నన్ను పిలిపించి నాకు లైన్‌ చెప్పారు దర్శకుడు శివ. ఆ లైన్‌ నాకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను.


‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రం గురించి, ఇందులో మీ పాత్ర గురించి చెప్పండి?

నేను, రామ్‌ ఖన్నా హీరోలుగా నటించాము. జోష్‌ రవి క్యారెక్టర్‌ కూడా ఈ కథకి చాలా కీలకమైనదే. ఎవరి పాత్రల్లో వారు అద్భుతంగా నటించారు. ఇందులో నా పాత్ర పేరు ఆనంద్‌. చాలా రెస్పాన్సిబిలిటీస్‌ వున్న ఒక కుర్రాడి పాత్ర. తన కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం కోసం విలేజ్‌ నుంచి సిటీకి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎంబిఎ, ఎంసిఎ చేసినోళ్లకే సిటీలో జాబ్స్‌ దొరకట్లేదు. డిగ్రీ చదివిన నాకు ఎవరు జాబ్‌ ఇస్తారు.. ఇక్కడ జాబ్‌ దొరకటం కష్టమేనని ఆ కుర్రాడికి అర్ధమైపోతుంది. ఎలాగోలా ఎమ్మెల్యే హౌస్‌లో ఒక జాబ్‌ సంపాదించడం, ఆ తర్వాత ఎమ్మెల్యే కుమర్తెను లవ్‌ చేయడం, ఎమ్మెల్యే గ్యాంగ్‌ మా వెంటపడటం లాంటి సన్నివేశాలు వుంటాయి. నార్మల్‌గా వుండే మా ముగ్గురి లైఫ్‌ని ఛేంజ్‌ చేసిన గేమ్‌ కాయ్‌ రాజా కాయ్‌. అది ఎలాగో ఇప్పుడు చెప్పడం కన్నా సినిమా చూస్తేనే బాగుంటుంది.
 

మారుతి టాకీస్‌ బ్యానర్‌లో ఇంతకుముందు వచ్చిన సినిమాలు యూత్‌ని టార్గెట్‌ చేసాయి. మరి ఈ ‘కాయ్‌ రాజా కాయ్‌’ చిత్రం ఎవర్ని టార్గెట్‌ చేసింది?


యాక్షన్‌, కామెడీతో పాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి. జోష్‌ రవి పాత్ర పూర్తి ఎంటర్‌టైనింగ్‌ని కలుగజేస్తుంది. ఇద్దరు హీరోయిన్స్‌ తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్‌ కష్టపడి నటించారు. దర్శకుడు శివగణేష్‌ మా దగ్గర్నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ‘కాయ్‌ రాజా కాయ్‌’ ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ కమర్షియల్‌ మూవీ. యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌, లవ్‌, ఫ్రెండ్‌షిప్‌ ఇలా ఒక కమర్షియల్‌ మూవీకి వుండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో వున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని నా నమ్మకం.

లవర్‌బోయ్‌ తరహా పాత్రలను పోషిస్తున్న మీకు మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే ఉద్దేశ్యం వుందా?

లవర్‌బోయ్‌గా వుంటూనే మాస్‌ ప్రేక్షకులను కూడా మెప్పించాలనుంది. అందుకు చాలా కష్టపడాలి. కానీ కృషి, పట్టుదల వుంటే ఏదైనా సాధించవచ్చు అంటారు. ఎప్పటికైనా ఇటు క్లాస్‌, అటు మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాను. బాడీ ఫిట్‌నెస్‌ కోసం వర్కవుట్స్‌ చేస్తున్నాను.

ఎలాంటి క్యారెక్టర్‌ చేయడానికి సిద్ధంగా వున్నారు?

కథకు ఇంపార్టెన్స్‌ వున్న క్యారెక్టర్‌ చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే. అయితే నేను పోషించే పాత్ర ద్వారా మానస్‌ మంచి నటుడు అనిపించుకోవాలని వుంది.

కొత్త ప్రాజెక్ట్‌ ఏమైనా ఒప్పుకున్నారా?

ప్రస్తుతం హీరోగా రెండు చిత్రాలు ఒప్పుకున్నాను. వీటిలో ఒక ప్రాజెక్ట్‌ పెద్ద బ్యానర్‌లో వస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దాదాపు షూటింగ్‌ కంప్లీట్‌ అవుతోంది. ఇంకా రెండు మూడు చిత్రాలకు సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాను. తమిళంలో ఒక పెద్ద బ్యానర్‌లో నటించమని దర్శక, నిర్మాతలు ఇటీవల సంప్రదించారు. కానీ వారు కంటిన్యూగా బల్క్‌ డేట్స్‌ అడిగారు. బల్క్‌ డేట్స్‌ వారికి కేటాయిస్తే తెలుగు సినిమాలకు కొంతకాలం దూరమవ్వాల్సి వస్తుందనే తలంపుతో ఇంకా నా నిర్ణయాన్ని తెలియజేయలేదు. తెలుగు సినిమాలకే నా మొదటి ప్రాధాన్యత వుంటుంది.. అని చెప్పాడు మానస్‌.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.