ENGLISH | TELUGU  

36 ఏళ్లుగా తన సంగీతంతో అలరిస్తున్న ‘స్వరవాణి’ కీరవాణి జీవితంలోని అరుదైన విశేషాలివే!

on Jul 3, 2025

(జూలై 4 ఎం.ఎం.కీరవాణి పుట్టినరోజు సందర్భంగా..)

తెలుగు సినీ సంగీత సామ్రాజ్యాన్ని కె.వి.మహదేవన్‌, చక్రవర్తి, ఇళయరాజా వంటి గొప్ప సంగీత దర్శకులు ఏలుతున్న రోజుల్లో వారి బాణీలకు భిన్నంగా ఉండే ఓ కొత్త సంగీత దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయనే ఎం.ఎం.కీరవాణి. ఒక తరహా సంగీతానికి పరిమితం కాకుండా ఫాస్ట్‌ బీట్‌, మెలోడీ, ఫోక్‌ సాంగ్స్‌, భక్తిరస గీతాలు.. ఇలా ఏ పాటకైనా తనదైన శైలిలో అద్భుతమైన స్వరాలు సమకూర్చగల స్వరవాణి కీరవాణి. 1989లో ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘మనసు మమత’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన కీరవాణి చాలా తక్కువ సమయంలోనే తన సంగీతంలోని మాధుర్యంతో ప్రేక్షకులను అలరించారు. 36 సంవత్సరాల ఆయన సినీ కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో 190 సినిమాలకు సంగీతాన్నందించారు. ఒక తెలుగు పాటకు తొలి ఆస్కార్‌ తెచ్చి పెట్టిన ఘనత ఎం.ఎం.కీరవాణికి దక్కుతుంది. సంగీత దర్శకుడిగా ఇంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కీరవాణి జీవితంలోని కొన్ని ఆసక్తికర విశేషాల గురించి తెలుసుకుందాం.

చిన్నతనంలో తల్లిదండ్రులు పెట్టిన పేరును బట్టి వారి జీవితం, వారి కెరీర్‌ సాగదు అనేది సత్యం. ఎవరి జీవితం ఎలా మలుపులు తిరుగుతుందో, కెరీర్‌ పరంగా ఏ రంగంలో వారు రాణిస్తారు అనేది చెప్పడం కష్టం. కానీ, కీరవాణి మాత్రం తన పేరును సార్థకం చేసుకున్నారు. కీరవాణి అనేది ఒక రాగం పేరు. ఆ పేరునే తన తల్లిదండ్రులు పెట్టడం, సంగీత ప్రపంచంలోనే కీరవాణి రాణించడం అనేది అరుదుగా జరిగే విషయం. కీరవాణి తండ్రి శివశక్తి దత్త సాహితీవేత్త, సంగీతం అభ్యసించినవారు. ఆయనకు ఎస్‌.రాజేశ్వరరావు సంగీతం అంటే ఎంతో మక్కువ. ‘విప్రనారాయణ’ చిత్రంలోని ‘ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన..’ అంటూ భానుమతి ఆలపించిన పాటంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈ పాటను కీరవాణి రాగంలో స్వరపరిచారు ఎస్‌.రాజేశ్వరరావు. ఆ పాటపై ఉన్న మక్కువతో తన కుమారుడికి కీరవాణి అనే పేరు పెట్టారు శివశక్తి దత్త. 

చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు కీరవాణి. అలాగే వయొలిన్‌ కూడా నేర్చుకున్నారు. ఆయన సంగీత కారుడే కాదు, మంచి కవి కూడా. సినిమా రంగానికి రాక ముందే ఎన్నో కథలు, కవితలు రాశారు. స్వాతి వంటి పత్రికలో ఆయన రచనలు వచ్చాయి. సాహిత్యంపై ఉన్న మక్కువతోనే వేటూరి సుందరరామ్మూర్తి దగ్గర కొంతకాలం శిష్యరికం చేశారు కీరవాణి. అలా సాహిత్య రచనలోని మెళకువల గురించి తెలుసుకున్నారు. సంగీత దర్శకుడిగా మారిన తర్వాత తన కెరీర్‌ ప్రారంభం నుంచి పాటలు రాస్తూనే ఉన్నారు కీరవాణి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ చిత్రంలో ‘నాకోసం నువ్వు..’, ‘అనగనగనగా..’, ‘బాహుబలి’ చిత్రంలో ‘కన్నా నిదురించరా..’, ‘ఒక ప్రాణం..’, ‘దండాలయ్యా..’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ‘జననీ..’, ‘ఈగ’ చిత్రంలోని ‘నేనే నానినే..’, ‘విక్రమార్కుడు’ చిత్రంలోని ‘జుం జుం మాయా..’, ‘జో లాలీ..’ వంటి పాటలు రచించారు కీరవాణి. కెరీర్‌ ప్రారంభంలో ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు, ఆత్మబంధం, పెళ్లిసందడి.. ఇలా చాలా సినిమాల్లో పాటలు రాశారు. ముఖ్యంగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు సాహిత్యాన్ని అందించారు కీరవాణి.

1979లో ఎన్‌.టి.రామారావు హీరోగా కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘యుగంధర్‌’ చిత్రంలోని ‘దాదాదా.. దాస్తే దాగేదా..’ అనే పాట కీరవాణిని బాగా ఆకర్షించింది. ఆ సినిమాకి ఇళయరాజా సంగీత దర్శకుడు. అప్పటికి ఆయన తెలుగులో అంత పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కాదు. ఆ ఒక్క పాటతో ఇళయరాజాకు అభిమానిగా మారిపోయారు కీరవాణి. ఆ తర్వాత సంగీత పరంగా ఆయన్ని ఎక్కువగా ఫాలో అయ్యారు. కీరవాణి మొదటి సినిమా ‘మనసు మమత’ విడుదలయ్యే సమయానికి ఇళయారాజా సౌత్‌లో టాప్‌ మోస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిపోయారు. ఆయన ప్రభావం కీరవాణిపై బాగా ఉండేది. మొదటి రెండు సంవత్సరాలు ఇళయరాజా తరహా పాటలే చేశానని కీరవాణి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన బాణీని ఏర్పరుచుకొని స్వరాలు సమకూర్చారు కీరవాణి. 

కీరవాణి తండ్రి శివశక్తి దత్తాకు, చినాన్న విజయేంద్రప్రసాద్‌కు సినిమా రంగంతో పరిచయాలు ఉండేవి. ఆ పరిచయాలతోనే చక్రవర్తి దగ్గర కీరవాణిని అసిస్టెంట్‌గా చేర్పించారు. వేటూరి దగ్గర, చక్రవర్తి దగ్గర పనిచేస్తున్న సమయంలో రామ్‌గోపాల్‌వర్మతో కీరవాణికి పరిచయం ఏర్పడిరది. మ్యూజిక్‌ పరంగా కీరవాణి టాలెంట్‌ ఏమిటో వర్మ గుర్తించారు. ‘నా ఫస్ట్‌ సినిమాకి నువ్వే మ్యూజిక్‌ డైరెక్టర్‌’ అని కీరవాణికి మాటిచ్చారు వర్మ. ‘శివ’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసే అవకాశం వచ్చినపుడు కీరవాణి గురించి నాగార్జునకు, వెంకట్‌కు చెప్పారు వర్మ. ‘డైరెక్టర్‌గా నువ్వు కొత్త.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా కొత్తవాడు ఎందుకు.. ఇళయరాజాను తీసుకుందాం’ అన్నారు. అలా వర్మ తొలి సినిమాకు సంగీతాన్ని అందించే ఛాన్స్‌ మిస్‌ అయ్యారు కీరవాణి. ఆ వెంటనే వర్మ దర్శకత్వంలోనే వచ్చిన ‘క్షణక్షణం’ చిత్రానికి మ్యూజిక్‌ చేసే అవకాశం కీరవాణికి ఇచ్చారు. 

తన కెరీర్‌ ప్రారంభంలోనే సీతారామయ్యగారి మనవరాలు చిత్రంతో సంగీత దర్శకుడుగా తనేమిటో ప్రూవ్‌ చేసుకున్నారు కీరవాణి. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలను మ్యూజికల్‌గా హిట్‌ చేశారు కీరవాణి. వీరిద్దరి కాంబినేషన్‌లో 27 సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాల్లోని పాటలు పెద్ద విజయం సాధించాయి. ఘరానా మొగుడు, అల్లరి మొగుడు, సుందరకాండ, అల్లరి ప్రియుడు, పెళ్లిసందడి వంటి సినిమాల పాటలు ఆరోజుల్లో చాలా పాపులర్‌ అయ్యాయి. ఫాస్ట్‌ బీట్‌, మెలోడీ సాంగ్స్‌లోనే కాకుండా భక్తి రసాత్మక చిత్రాల్లోనూ వీనుల విందైన సంగీతాన్ని అందించారు కీరవాణి. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి, పాండురంగడు చిత్రాల్లోని పాటలు ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. 

తమ్ముడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్‌ నెం.1 నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు అన్ని సినిమాలకూ అద్భుతమైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసి ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు కీరవాణి. ఇప్పటివరకు రాజమౌళి 12 సినిమాలకు దర్శకత్వం వహించగా, దాదాపు ప్రతి సినిమాలోనూ ఒకటి, రెండు పాటలు రాసే అవకాశం కీరవాణికి ఇచ్చారు రాజమౌళి. ఒక దర్శకుడు చేసిన అన్ని సినిమాలనూ మ్యూజికల్‌ హిట్స్‌ చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఆ ఘనత సాధించారు కీరవాణి.

ఇక కీరవాణి చేసిన పాటలకు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి లభించిన పురస్కారాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంబంధించి ‘నాటు నాటు..’ పాటకు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డు రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం. అలాగే ‘అన్నమయ్య’ చిత్రాన్ని ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు కీరవాణి. ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కిగాను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. ఇక ఉత్తమ సంగీత దర్శకుడుగా, నేపథ్య గాయకుడుగా, పాటల రచయితగా నంది అవార్డులు, ఫిలింఫేర్‌ అవార్డులు, అంతర్జాతీయ అవార్డులు కీరవాణిని వరించాయి. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ 36 సంవత్సరాలుగా అందరూ మెచ్చే వీనుల విందైన సంగీతాన్ని అందిస్తున్న కీరవాణి.. తాజాగా మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌ రాబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.