ENGLISH | TELUGU  

దశాబ్దకాలం హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమను ఏలిన చలాకీ కన్నుల మంజుల!

on Jul 4, 2025

(జూలై 4 నటి మంజుల జయంతి సందర్భంగా..)

తమ అందం, అభినయంతో కథానాయికలుగా మంచి పేరు తెచ్చుకున్నవారు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. వారిలో ప్రేక్షకుల మనసుకు దగ్గరైన వారు, వారి మనసుల్ని దోచుకున్న వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందం, అభినయంతోపాటు చలాకీతనం, చిలిపితనం, కళ్ళతోనే నవ్వులు చిందించగల ప్రతిభ ఆమె సొంతం. మంజుల వంటి హీరోయిన్లు ఇండస్ట్రీకి అరుదుగా వస్తుంటారు. ఆమె అందానికి ఆరోజుల్లో ఎంతో మంది మనసు పాడుచేసుకున్నారు. కేవలం ఆమెను చూసేందుకే యూత్‌ మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కి వెళ్లేవారు. 40 సంవత్సరాల తన కెరీర్‌లో 100కి పైగా చిత్రాల్లో నటించారు మంజుల. దశాబ్దంపాటు తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ సినిమాల్లో తిరుగులేని కథానాయికగా పేరు తెచ్చుకున్న మంజుల జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.

1954 జూలై 4న మద్రాస్‌లో జన్మించారు మంజుల. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. చదువుతోపాటు కళల పట్ల కూడా ఆమె శ్రద్ధ చూపించేవారు. స్కూల్‌లో జరిగే కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌లో కూడా ఆమె పాల్గొనేవారు. చిన్నతనం నుంచీ ఎంతో చలాకీ ఉంటూ అందర్నీ ఆకర్షించేవారు మంజుల. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే మంజులకు సినిమాలపై ఆసక్తి కలిగింది. సినిమాల్లో నటించాలన్న ఆమె ఆలోచనను తల్లిదండ్రులు కూడా బలపరిచారు. 1970లో జెమిని గణేశన్‌ హీరోగా తమిళ్‌లో రూపొందిన ‘శాంతి నిలయం’ చిత్రం ద్వారా నటిగా పరిచయమయ్యారు మంజుల. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు. ఆ సినిమాలో జెమినీ గణేశన్‌కు మేనకోడలి పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎం.జి.రామచంద్రన్‌ హీరోగా వచ్చిన ‘రిక్షాకారన్‌’ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించారు. 

జైజవాన్‌ చిత్రం ద్వారా తెలుగు తెరకు నటిగా పరిచయమయ్యారు మంజుల. మరపురాని మనిషి, నీతినిజాయితి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించిన తర్వాత కృష్ణ హీరోగా రూపొందిన మాయదారి మల్లిగాడు చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్‌ హీరోయిన్‌గా మంజులకు ఈ సినిమా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత తెలుగులో అందరు టాప్‌ హీరోల సరసన నటించారు. ఎన్టీఆర్‌తో వాడే వీడు, మనుషులంతా ఒక్కటే, దేవుడు చేసిన మనుషులు, నేరం నాది కాదు ఆకలిది, మా ఇద్దరి కథ, చాణక్య చంద్రగుప్త చిత్రాల్లో నటించారు. ఎఎన్నార్‌తో మహాకవి క్షేత్రయ్య, దొరబాబు, బంగారు బొమ్మలు సినిమాలు చేశారు. మాయదారి మల్లిగాడు తర్వాత కృష్ణతో భలే దొంగలు, మనుషులు చేసిన దొంగలు చిత్రాల్లో నటించారు మంజుల. అయితే తెలుగులో శోభన్‌బాబు కాంబినేషన్‌లో ఎక్కువ సూపర్‌హిట్‌ సినిమాలు చేశారు మంజుల. మంచి మనుషులు, పిచ్చిమారాజు, జేబుదొంగ, ఇద్దరూ ఇద్దరే, గుణవంతుడు, మొనగాడు సినిమాలు చేశారు. శోభన్‌బాబు, మంజుల హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అలా పదేళ్ళపాటు గ్లామర్‌ హీరోయిన్‌గా తన హవాను కొనసాగించారు మంజుల. 

1980వ దశకం వచ్చేసరికి మంజులకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాయి. 1983 వరకు నటిగా కొనసాగిన ఆమె కొంత గ్యాప్‌ తీసుకొని 1988లో రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన చిక్కడు దొరకడు చిత్రంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు. టూ టౌన్‌ రౌడీ, ప్రేమ, చంటి, సరదాబుల్లోడు, వాసు వంటి సినిమాల్లో నటించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వెంకటేష్‌ సినిమాల్లోనే ఎక్కువగా నటించడం విశేషం. 2011లో వచ్చిన వాసు తెలుగులో మంజుల నటించిన చివరి సినిమా. 

ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1976లో నటుడు విజయకుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు వనిత, ప్రీత, శ్రీదేవి. వీరు కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. విజయకుమార్‌కు అంతకుముందే వివాహం అయింది. వారికి కలిగిన సంతానంలో అరుణ్‌ విజయ్‌ హీరోగా, విలన్‌గా రాణిస్తున్నారు. 2011 తర్వాత సినిమాలకు దూరమైన మంజుల.. కొన్ని తెలుగు, తమిళ సీరియల్స్‌లో నటించారు. అలాగే కొన్ని గేమ్‌ షోలలో కూడా కనిపించారు. 2013లో జూలై 23న మంజుల ప్రమాదవశాత్తూ మంచం మీద నుంచి కింద పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ గాయంతోపాటు కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా అదేరోజు 59 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు మంజుల. కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా మంజుల పేరుతో ఒక హీరోయిన్‌ ఉండేవారు. 1986లో వంటగదిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 31 ఏళ్ళ అతి చిన్న వయసులో మంజుల ప్రాణాలు విడిచారు. ఒకే పేరు ఉన్న ఈ ఇద్దరు నటీమణులు ప్రమాదవశాత్తూ మరణించడం గమనార్హం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.