ENGLISH | TELUGU  

ఎవరి దగ్గరా పనిచేయకుండా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన చక్రి.. ఎలాగో తెలుసా?

on Jun 15, 2025

ఏ సినిమాకైనా కథ, కథనాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. సంగీతానికి కూడా అంతే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంగీతం సినిమా ఫలితాన్ని కూడా డిసైడ్‌ చేస్తుంది. సంగీత దర్శకుడిగా పరిశ్రమలో ప్రవేశించి సక్సెస్‌ అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సాధారణ సంగీతానికి, సినీ సంగీతానికి చాలా డిఫరెన్స్‌ ఉంటుంది. సంగీతంలో తలలు పండిన వారు కూడా సినిమా సంగీతానికి న్యాయం చెయ్యలేరు. అందుకే వారు కచ్చేరీలకే పరిమితమవుతారు తప్ప చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి కూడా చూడరు. ప్రేక్షకులు కోరుకునే సంగీతాన్ని అందించడం, వారు పాడుకునేలా పాటల్ని స్వరపరచడం అనేది ఒక ప్రత్యేకమైన కళ. దాన్ని పట్టుకొని సినీ సంగీత ప్రపంచంలో పేరు సంపాదించుకోవడం చాలా కష్టమైన విషయం. ఇందులో రాణించాలంటే ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర శిష్యరికం చేయాలి. అందులోని మెళకువలు నేర్చుకోవాలి. ఆ తర్వాతే స్వంతంగా సినిమాలకు సంగీతం అందించగలరు. కానీ, ఏ సంగీత దర్శకుడి దగ్గరా పనిచేయకుండా సినీ సంగీత దర్శకుడైన ఘనత చక్రికి దక్కుతుంది. 2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బాచి’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమైన చక్రి 2014 వరకు దాదాపు 85 సినిమాలకు సంగీతాన్ని అందించారు. 150 పాటలు పాడారు. అందులో ఎక్కువ శాతం సినిమాలు మ్యూజికల్‌గా హిట్‌ అయినవే. ప్రముఖ సంగీత దర్శకుడిగా, సింగర్‌గా పేరు తెచ్చుకున్న చక్రి సినిమా ఇండస్ట్రీలోకి ఎలా ప్రవేశించారు? ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

1974 జూన్‌ 15న వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ సమీపంలోని కంభాలపల్లిలో జిల్లా వెంకటనారాయణ, విద్యావతి దంపతులకు జన్మించారు చక్రధర్‌ అలియాస్‌ చక్రి. వెంకటనారాయణ టీచర్‌గా ఉద్యోగం చేస్తూనే బుర్రకథలు స్వయంగా రాసి ప్రదర్శించేవారు. తల్లి విద్యావతి గాయని. వారివల్లే చక్రికి సంగీతం పట్ల ఆసక్తి పెరిగింది. చిన్నతనం నుంచి బాగా పాడేవారు. చక్రిలోని టాలెంట్‌ చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించేవారు. చిన్నతనంలోనే ఫ్లూట్‌ వాయిద్యాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత వయొలిన్‌తోపాటు కర్ణాటక సంగీతాన్ని కూడా అభ్యసించారు. ఆ తర్వాత మిత్రులతో కలిసి సాహితీ కళాభారతి పేరుతో ఓ ట్రూప్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ చుట్టుపక్కల జరిగే కార్యక్రమాల్లో చక్రి ట్రూప్‌ ప్రదర్శన తప్పనిసరిగా ఉండేది. చక్రిలోని టాలెంట్‌ ఇలాంటి ప్రదర్శనలకు పరిమితం కాకూడదని స్నేహితులు భావించేవారు. హైదరాబాద్‌ వెళ్లి సినిమాల్లో ప్రయత్నించమని పదే పదే చెప్పేవారు. చక్రి వారి మాట వినేవారు కాదు. చివరికి వారి పోరు తట్టుకోలేక హైదరాబాద్‌ బయల్దేరారు చక్రి.

మొదట ‘పండువెన్నెల’ అనే ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ను రూపొందించారు. అందులోని పాటల్ని తనే స్వయంగా రాసి సంగీతం సమకూర్చారు. 1995లో హైదరాబాద్‌ వెళ్లిన చక్రి మూడు సంవత్సరాల్లో దాదాపు 30 ఆల్బమ్స్‌ చేశారు. అదే క్రమంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘చిరునవ్వు’ అనే ఆల్బమ్‌ రూపొందించారు. అది విని చక్రిని ఎంతో అభినందించారు చిరంజీవి. ఆ ఆల్బమ్‌ వల్లే చక్రికి తొలి అవకాశం వచ్చింది. బద్రి తర్వాత బాచి చిత్రానికి చక్రిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు పూరి జగన్నాథ్‌. ఈ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో చక్రికి గుర్తింపు రాలేదు. ఈ సినిమా తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రానికి మరోసారి చక్రిని తీసుకున్నారు పూరి. అయితే ఆ చిత్ర నిర్మాత చక్రిని తీసుకోవడానికి ఒప్పుకోలేదు. దాంతో నిర్మాతనే మార్చేశారు తప్ప చక్రికి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేదు పూరి. అలా వారి మధ్య స్నేహం కంటే సోదర భావం పెరిగింది. తను చేస్తున్న సినిమాలకు వరసగా అవకాశాలు ఇచ్చి చక్రి సంగీత దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి తోడ్పడ్డారు పూరి. 

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం పాటలు సూపర్‌హిట్‌ అవ్వడంతో చక్రికి అవకాశాలు రావడం మొదలైంది. ఇతర డైరెక్టర్ల సినిమాలు చేస్తూనే పూరి జగన్నాథ్‌తో ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, 143, ఆంధ్రావాలా వంటి సినిమాలు చేశారు. మరోపక్క డైరెక్టర్‌ వంశీ కాంబినేషన్‌లో చేసిన సినిమాలు కూడా చక్రికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చాయి. అప్పటివరకు ఇళయరాజాతో వరసగా సినిమాలు చేసిన వంశీ.. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమా నుంచి చక్రితోనే కంటిన్యూ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గోపి గోపిక గోదావరి, దొంగరాముడు అండ్‌ పార్టీ వంటి సినిమాలు వచ్చాయి. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయమైన రెండు సంవత్సరాలకే చక్రి బాగా బిజీ అయిపోయారు. 2003లో 13 సినిమాలకు మ్యూజిక్‌ చేశారు. అదే సంవత్సరం సత్యం సినిమాలోని ‘ఓ మగువ నీతో స్నేహం కోసం..’ పాటకు బెస్ట్‌ సింగర్‌గా ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు చక్రి. ఆ తర్వాత దేవదాసు, కృష్ణ, దేశముదురు, సింహా, నేనింతే, పెదబాబు.. ఇలా చాలా సినిమాలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ చేశారు. టాలీవుడ్‌లో వున్న ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌కీ లేని ప్రత్యేకత చక్రిలో ఉంది. అదేమిటంటే.. తను కెరీర్‌ స్టార్ట్‌ చేసినప్పటి నుంచి ప్రతి సినిమాలోనూ కొత్త సింగర్స్‌కి, కొత్త లిరిక్‌ రైటర్స్‌కి అవకాశాలు ఇస్తూనే వచ్చారు. తను చేసిన 85 సినిమాల్లో 65 మంది కొత్త సింగర్స్‌కి అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు చక్రి. 

చక్రి గొప్ప స్నేహశీలిగా పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలోని అందరితోనూ స్నేహంగా ఉండే చక్రి.. ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అతను చేసిన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల నుంచే సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. తన ప్రతి పుట్టినరోజున ఏదో ఒక కార్యక్రమం చేపట్టేవారు. అతని అభిమానులు రక్తదానం చేసేవారు. వరదలు సంభవించినపుడు బాధితులకు అభిమానులతో కలిసి నిత్యావసర సరుకులు అందించేవారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా బిజీగా ఉన్న సమయంలోనే 2014 డిసెంబర్‌ 14న 40 ఏళ్ళ వయసులో గుండెపోటుతో కన్ను మూశారు చక్రి. ఆయన మరణం ఇండస్ట్రీలోని ఎంతో మందిని కలచివేసింది. ఆ సందర్భంగా వారు మాట్లాడిన మాటలు చక్రిపై వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేసింది. ముఖ్యంగా దాసరి నారాయణరావు స్పందిస్తూ.. చక్రి తన బిడ్డలాంటివాడు అన్నారు. విశేషం ఏమిటంటే.. సంగీత దర్శకుడుగా చక్రి చివరి సినిమా ఎర్రబస్సు. అలాగే దర్శకుడుగా దాసరి నారాయణరావు చివరి సినిమా కూడా అదే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.