ENGLISH | TELUGU  

తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన మహాకవి శ్రీశ్రీ!

on Jun 15, 2025

(జూన్‌ 15 మహాకవి శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా..)

అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకనర్హం.. ఈ వాక్యం వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు శ్రీశ్రీ. తన రచనలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపి ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన మహాకవి. హేతువాది, నాస్తికుడు, విప్లవకవి.. ఇలా అనేక భిన్నమైన కోణాలు కలిగిన తెలుగు రచయిత. గన్ను కంటే పెన్ను బలమైనదని నిరూపించిన వ్యక్తి. విప్లవ సాహిత్యంలోనే కాదు, సినిమా సాహిత్యంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్న మేధావి. సినిమా పాటల్లోనూ తన అభ్యుదయ భావాలను పలికించారు. అంతేకాదు, ప్రేమ గీతాల్లోనూ తనదైన బాణీలో రచనలు చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారి ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డు అందుకున్నారు శ్రీశ్రీ. అంతటి మహాకవి జీవితంలోని కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం.

శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం అనేది ఆయన ఇంటిపేరు అని అందరూ అనుకున్నారు. కానీ, అది ఇంటిపేరు కాదు అనే విషయం కొందరికే తెలుసు. 1930 ఏప్రిల్‌ 30న విశాఖపట్నంలో పూడిపెద్ది వెంకటరమనయ్య, ఆటప్పకొండ దంపతులకు జన్మించారు పూడిపెద్ది శ్రీనివాసరావు. ఆయన్ని శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోవడం వల్ల శ్రీరంగం ఇంటిపేరుగా మారింది. శ్రీశ్రీ పాఠశాల విద్యాభ్యాసం అంతా విశాఖలో సాగింది. తర్వాత మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో బీఏ హానర్స్‌ చేశారు. ఆంధ్రప్రభ పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా తన కెరీర్‌ స్టార్ట్‌ చేశారు. ఢల్లీి ఆకాశవాణి, ఆంధ్రవాణి పత్రికల్లోనూ శ్రీశ్రీ పని చేశారు. తెలుగు రచనలో తొలి అభ్యుదయ కవి శ్రీశ్రీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సామాన్యుల గొంతుకగా మారిన కవి శ్రీశ్రీ. ఆయన పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది ‘మహాప్రస్థానం’. అందులో కవితలు ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో ప్రముఖుల నోటి వెంట వినపడతాయి. ‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే...’, ‘మరో ప్రపంచం’, ‘నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం అనితరసాధ్యం నా మార్గం’ తదితర కవితలు ఆయన రాసినవే.

1950లో విడుదలైన ‘ఆహుతి’ అనే డబ్బింగ్‌ సినిమాకు మాటలు, పాటలు రాయడం ద్వారా సినీ కెరీర్‌ను ప్రారంభించారు శ్రీశ్రీ. తెలుగులో తొలి డబ్బింగ్‌ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా రచయితగా ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. దీంతో దర్శకనిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి నెలకు 300 రూపాయల జీతంతో తన ఆస్థాన రచయితగా నియమించుకున్నారు. అక్కడి నుంచి శ్రీశ్రీ రచయితగా బాగా బిజీ అయిపోయారు. ఎన్నో డబ్బింగ్‌ సినిమాలకు మాటలు, పాటలు రాశారు. బి.విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ఓ సినిమాకు ఒకేరోజు 12 పాటలు రాసి రికార్డు సృష్టించారు. 

1974లో సూపర్‌స్టార్‌ కృష్ణ స్వీయ నిర్మాణంలో నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా.. దీక్ష బూని సాగరా..’ అంటూ శ్రీశ్రీ రాసిన విప్లవ గేయానికి జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు లభించింది. తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డు అదే. ఆ తర్వాత టి.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘నేటి భారతం’ చిత్రంలోని ‘అర్థరాత్రి స్వతంత్రం అంధకార బంధురం..’ పాటకు నంది అవార్డు అందుకున్నారు శ్రీశ్రీ. ఇవికాక తన ఇతర రచనలకు గాను సాహిత్య అకాడమీ అవార్డుతోపాటు అనేక ఇతర పురస్కారాలు ఆయన్ని వరించాయి. 

శ్రీశ్రీకి ఇద్దరు భార్యలు. మొదటి సతీమణి పేరు వెంకట రమణమ్మ. ఆవిడ మరణం తర్వాత సరోజినీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. వాళ్ల పేర్లు మాల, మంగళ, మంజుల. అబ్బాయి పేరు వెంకట్‌. హాస్యనటుడు రాజబాబుకి శ్రీశ్రీ తోడల్లుడు. శ్రీశ్రీ మరదల్ని రాజబాబు పెళ్లి చేసుకున్నారు.

తెలుగు సినిమాల్లో ఎన్నో విజయవంతమైన పాటలు రాశారు శ్రీశ్రీ. ఒక తరహా పాటలకే పరిమితం కాకుండా అన్నిరకాల పాటలు రాసి ప్రేక్షకుల్ని అలరించారు. ‘వెలుగు నీడలు’లో ‘పాడవోయి భారతీయుడా...’, ‘ఇలవేల్పు’ సినిమాలో ‘చల్లని రాజా ఓ చందమామ’, ‘ఊరుమ్మడి బతుకులు’ సినిమాలో ‘శ్రామిక జీవన సౌందర్యానికి సమాధానమనేది లేనే లోదోయ్‌’ ‘డాక్టర్‌ చక్రవర్తి’లో ‘మనసున మనసై’, ‘మనుషులు మారాలి’ సినిమాలో ‘తూరుపు సింధూరపు’, ‘ఈనాడు’ సినిమాలో ‘రండి కదిలి రండి...’, ‘ఆరాధన’ సినిమాలో ‘నా హృదయంలో నిదురించే చెలి’ ఇలా శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ఎన్నో ఆణిముత్యాలు ఇప్పటికీ సంగీత ప్రియులు ఆస్వాదిస్తూనే ఉంటారు. సాహితీ ప్రియుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న శ్రీశ్రీ చివరి రోజుల్లో క్యాన్సర్‌ బారిన పడి కొంతకాలం ఆ వ్యాధితో బాధపడిన ఆయన 1983 జూన్‌ 15న తుది శ్వాస విడిచారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.