లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలివే.. కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా
on Sep 28, 2023
లతా మంగేష్కర్.. సంగీత ప్రియులకు ఈ పేరే ఓ మధురగీతం విన్న భావన కలిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఉత్తరాదికి చెందిన లత ప్రధానంగా హిందీలోనే పాటలు పాడినప్పటికీ.. బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, నేపాలీ, ఒడియా, పంజాబీ, సింహళ, తమిళ్, తెలుగు, బహస, భోజ్ పురి, సింధీ, ఉర్దూ, కొంకణి, తుళు, మరాఠీ భాషల్లోనూ పలు గీతాలు ఆలపించి తన గాత్రంతో శ్రోతలను పరవశింపజేశారు.
ఇక తెలుగు గీతాల విషయానికి వస్తే.. ఆమె రెండే రెండు సినిమాల్లో పాటలు పాడారు. అవి కూడా.. అక్కినేని కాంపౌండ్ హీరోల చిత్రాలు కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించిన సంతానం సినిమాలో నిదురపోరా తమ్ముడా అంటూ సాగే పాటని రెండు వెర్షన్స్ లో ఆలపించారు లతాజీ. అందులో ఒకటి సోలో సాంగ్ కాగా.. మరొకటి మధుర గాయకుడు ఘంటసాల మాస్టర్ తో కలిసి పాడిన వెర్షన్. ప్రముఖ స్వరకర్త సుసర్ల దక్షిణామూర్తి ఈ గీతాలకి సంగీతమందించారు. ఇక రెండో చిత్రం విషయానికి వస్తే.. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున హీరోగా నటించిన ఆఖరి పోరాటం కోసం లత మరోసారి తెలుగు పాట గానం చేశారు. తెల్లచీరకు తకధిమి అంటూ సాగే ఈ యుగళగీతాన్ని గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు లతాజీ. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఈ పాటకు ట్యూన్ కట్టారు. మొత్తమ్మీద.. లతా మంగేష్కర్ పాడిన రెండు పాటలు కూడా అక్కినేని కాంపౌండ్ వే కావడం విశేషం.
(సెప్టెంబర్ 28.. లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా)

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
