ENGLISH | TELUGU  

60 ఏళ్ళ క్రితమే విజువల్‌ ఎఫెక్ట్స్‌లో వండర్స్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు బి.విఠలాచార్య!

on Jan 27, 2025

( జనవరి 28 దర్శకుడు బి.విఠలాచార్య జయంతి సందర్భంగా..)

93 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో కొన్ని వేల సినిమాలు విడుదలయ్యాయి. వివిధ జోనర్స్‌లో సినిమాలు రూపొందించడం ద్వారా ఎంతో మంది దర్శకులు పరిశ్రమకు పరిచయమయ్యారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. వారందరిలో ఎంతో భిన్నమైన డైరెక్టర్‌ అనిపించుకున్నవారు బి.విఠలాచార్య. అందరు డైరెక్టర్ల దారి వేరు, ఆయన దారి వేరు. ప్రేక్షకుల్ని ఓ కొత్తలోకంలోకి తీసుకెళ్లి అక్కడి వింతలు, విడ్డూరాలు చూపించి, వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడమే ఆయన లక్ష్యం. థియటర్‌కి వచ్చే ప్రేక్షకుల మనసు నిండా వినోదాన్ని, ఓ కొత్త అనుభూతిని నింపి పంపడమే ఆయనకు తెలుసు. గ్రాఫిక్స్‌ లేని రోజుల్లోనే ట్రిక్‌ ఫోటోగ్రఫీ ద్వారా ప్రేక్షకుల్ని మాయ చేసి థ్రిల్‌ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. జానపద చిత్రాలను తియ్యాలంటే విఠలాచార్యకు తప్ప మరొకరికి సాధ్యం కాదని నిరూపించుకొని జానపద బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు. టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు విఠలాచార్య. సినిమాలకు మ్యాజిక్‌ తప్ప లాజిక్‌ అవసరం లేదని గట్టిగా నమ్ముతారాయన. అందుకే ఆయన కెరీర్‌లో ఆ తరహా సినిమాలనే రూపొందించారు. అంతటి దర్శక మాంత్రికుడి సినీ జీవితం ఎలా ప్రారంభమైంది? ఆయన జీవితంలోని విశేషాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.

1920 జనవరి 28న కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు విఠలాచార్య. ఆయన తండ్రి పద్మనాభాచార్య ఆయుర్వేద వైద్యుడు. అందరికీ ఉచితంగా వైద్యం చేసేవారు. విఠలాచార్యకు చిన్నతనం నుంచి నాటకాలు, యక్షగానాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆయన మూడో తరగతి వరకే చదువుకున్నారు. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు 9 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయల్దేరారు. అరసికెరె పట్టణంలో తన కజిన్‌ నుంచి ఉడిపి రెస్టారెంట్‌ని కొనుగోలు చేసి కొన్నాళ్లు నిర్వహించారు. ఆ సమయంలోనే క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్ళారు విఠలాచార్య. ఆ తర్వాత తన హోటల్‌ను తమ్ముడికి అప్పగించితన స్నేహితుడు శంకర్‌ సింగ్‌తో కలిసి  హసన్‌ జిల్లాలో ఓ టూరింగ్‌ టాకీస్‌ను తీసుకున్నారు. అందులో ప్రదర్శించే సినిమాలన్నింటినీ చూసి సినిమా అంటే టెక్నికల్‌గా ఎలా ఉంటుందో ఒక అవగాహన తెచ్చుకున్నారు. 

తన స్నేహితుడితో కలిసి మహాత్మ పిక్చర్స్‌ అనే బేనర్‌ను స్టార్ట్‌ చేసి 18 సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత అతని నుంచి విడిపోయి సొంతంగా విఠల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి కన్నడలో శ్రీశ్రీనివాస కళ్యాణ పేరుతో తొలి చిత్రాన్ని నిర్మించారు. అలా కన్నడలోనే నాలుగు సినిమాలు నిర్మించిన తర్వాత వద్దంటే పెళ్లి చిత్రంతో తెలుగు చిత్ర సీమలో ప్రవేశించారు విఠలాచార్య. కాంతారావు హీరోగా రూపొందించిన జయవిజయ చిత్రంతో జానపద చిత్రాల ఒరవడిని పెంచారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌, కాంతారావులతో వరసగా జానపద చిత్రాలు చేశారు. కనకదుర్గ పూజా మహిమ, బందిపోటు, చిక్కడు దొరకడు, అగ్గిబరాట, నిన్నే పెళ్లాడతా, భలే మొనగాడు, ఆలీబాబా 40 దొంగలు, లక్ష్మీకటాక్షం, విజయం మనదే, రాజకోట రహస్యం వంటి విజయవంతమైన జానపద చిత్రాలు రూపొందించారు. ఎన్టీఆర్‌, కాంతారావులకు మాస్‌ ఇమేజ్‌ని తెచ్చిన దర్శకుడు విఠలాచార్య. ఎన్టీఆర్‌తో 15 సినిమాలు చేశారు. అందులో 5 సినిమాలు ఆయన సొంత బేనర్‌లో నిర్మించినవే. 40 ఏళ్ళ కెరీర్‌లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 70 సినిమాలకు దర్శత్వం వహించారు విఠలాచార్య. 

విఠలాచార్య సినిమాల్లో నటీనటులకే కాకుండా జంతువులకు, పక్షులకు కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. సినిమా నిర్మాణ వ్యయం ఎలా తగ్గించాలి అనే విషయంలో ఒక స్థిరమైన నిర్ణయంతో ఉండేవారు. బడ్జెట్‌ను ఎలా కంట్రోల్‌ చెయ్యాలి అనే విషయంలో ఎంతో మందికి మార్గదర్శకంగా ఉన్నారు. ఒక సినిమా కోసం వేసిన సెట్‌ను కొన్ని మార్పులు చేసి తర్వాత సినిమాకి వాడేవారు. ఒకే సెట్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఎక్కువ సెట్స్‌ వేసిన ఫీల్‌ తీసుకొచ్చేవారు. అలాగే కాస్ట్యూమ్స్‌, ఆభరణాలు కూడా ప్రధాన పాత్రలకు తప్ప మిగతా పాత్రలకు వాటినే వాడేవారు. ప్రేక్షకుల్ని తమ సినిమాలోని కథతో కట్టి పడెయ్యాలి. అప్పుడు ఈ తేడాలను వారు గుర్తించలేరు అని చెప్పేవారు విఠలాచార్య. నటీనటుల కాల్షీట్లు అడ్జస్ట్‌ కానప్పుడు, వారు సినిమా నుంచి తప్పుకున్నప్పుడు వారి పాత్రలను కోతులుగానో, చిలుకలుగానో మార్చేసి ఆటంకం లేకుండా సినిమా పూర్తి చేసేవారు. 

ఇక తన సినిమా కోసం పనిచేసే నటీనటులకు, టెక్నీషియన్స్‌కి కమిట్‌ అయిన పారితోషికాన్ని విభజించి ప్రతినెలా ఒకటవ తేదీన అందరికీ చెక్కులు పంపించేవారు. తమ యూనిట్‌ పట్ల అంత శ్రద్ధ తీసుకునేవారు. సినిమా ప్రారంభం రోజునే విడుదల తేదీని కూడా ప్రకటించి అదే రోజు రిలీజ్‌ చెయ్యడం ఆరోజుల్లో విఠలాచార్యకు మాత్రమే సాధ్యమైంది. జానపద చిత్రాల జోరు తగ్గిన తరుణంలో అక్కినేనితో బీదలపాట్లు అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించలేదు. ఆ తర్వాత తన పంథాను కొంత మార్చి నరసింహరాజు వంటి యంగ్‌ హీరోతో గంధర్వకన్య, జగన్మోహిని, మదనమంజరి, నవమోహిని, జై బేతాళ, మోహిని శపథం, వీరప్రతాప్‌ వంటి జానపద చిత్రాలను నిర్మించి విజయం సాధించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా కరుణించిన కనకదుర్గ. 

విఠలాచార్య వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1944లో జయలక్ష్మీ ఆచార్యను వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. సినిమాలకు దూరమైన తర్వాత మనవళ్ళతో, మనవరాళ్ళతో శేష జీవితాన్ని సంతోషంగా గడిపారు విఠలాచార్య. కొన్నాళ్ళకు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో 1999 మే 28న చెన్నయ్‌లో తుదిశ్వాస విడిచారు. తన సినిమాలతో జానపద హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఎన్‌.టి.రామారావు పుట్టినరోజునే విఠలాచార్య కన్ను మూయడం యాధృశ్చికం. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.