ENGLISH | TELUGU  

38 ఏళ్ళ వయసు వరకు వేటూరి ఇండస్ట్రీకి రాకపోవడానికి కారణం తెలుసా? 

on Jan 28, 2025

(జనవరి 29 గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జయంతి సందర్భంగా..)

తెలుగు సినిమా పాటను కొత్త పుంతలు తొక్కించి, పండితుల నుంచి పామరుల వరకు నోరారా పాడుకునే పాటల్ని అందించిన అక్షర శిల్పి వేటూరి సుందరరామ్మూర్తి. భాష, భావుకతలను రెండు కళ్లుగా చేసుకొని మనసు పొరల్ని అంతర్లీనంగా తడిమిన అద్భుత గేయ రచయిత. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టే.. ఆయన కలానికి కూడా రెండు వైపులా పదును ఉంటుంది. సంస్కృత సమాసాలతో పాటను రాసి రక్తి కట్టించగలరు, మసాలాలు దట్టించి మాస్‌ శ్రోతలను ఉర్రూతలూగించగలరు. దాదాపు 40 సంవత్సరాలపాలు తెలుగు పాటను పరవళ్లు తొక్కించిన వేటూరి 5,000కి పైగా పాటలు రాశారు. ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర వంటి దిగ్గజ కవులు తెలుగు సినిమా పాటను ఏలుతున్న రోజుల్లో చిత్ర రంగ ప్రవేశం చేసిన వేటూరి తన పాటలతో తెలుగువారి హృదయాలను దోచుకున్నారు. ఆరోజుల్లో ఒక్కో రచయితలో ఒక్కో ప్రత్యేకత ఉండేది. కానీ, వారందరి ప్రత్యేకత తనలోనే పొందుపరుచుకున్న అసమాన గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి. తన 38వ ఏట కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఓ సీత కథ చిత్రంలోని భారతనారి చరితము అనే హరికథతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. చిత్ర పరిశ్రమకు అంత ఆలస్యంగా రావడం వెనుక కారణం ఏమిటి, గేయ రచయితగా ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది, తెలుగు సినిమా పాట రచనలో ఎలాంటి ప్రయోగాలు చేశారు వంటి విషయాలు ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం. 

1936 జనవరి 29న కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లి గ్రామంలో వేటూరి చంద్రశేఖరశాస్త్రి, కమలాంబ దంపతులకు జన్మించారు వేటూరి సుందరరామ్మూర్తి. వీరిది సంగీత, సాహిత్య సమ్మేళనంగా ఉన్న కుటుంబం. తండ్రి నేత్ర వైద్యులుగా ఉండేవారు. ఆయనకు సాహిత్యంలో ప్రవేశం ఉంది. అలాగే వేటూరి పెదనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి మంచి సాహితీ వేత్త. తల్లి కమలాంబకు సాహిత్యంలోనూ, సంగీతంలోనూ ప్రవేశం ఉంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చారు వేటూరి. వృత్తి రీత్యా వీరి కుటుంబం విజయవాడ వచ్చింది. అక్కడ 5వ తరగతి వరకు చదువుకున్నారు వేటూరి. ఆ తర్వాత జగ్గయ్యపేటలో 9వ తరగతి వరకు, గుంటూరు జిల్లాలోని కొల్లూరులో ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు చదువుకున్నారు. మద్రాస్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత విజయవాడ వచ్చి బి.ఎ. ఎకనమిక్స్‌ చేశారు. అటు పిమ్మట లా చేసేందుకు మద్రాస్‌ వెళ్లారు. చదువుతున్న రోజుల్లోనే రచనల పట్ల ఆసక్తి బాగా పెరిగింది. అయితే ఆయన ఎలాంటి సాహిత్యాన్ని చదవలేదు. కేవలం రేడియోలో పాటలు వినడం ద్వారానే పాటలు రాయాలనే ఆసక్తి పెరిగిందని వేటూరి చెప్పేవారు. లా రెండో సంవత్సరంలో ఉండగానే జర్నలిజంలో చేరితే బాగుంటుందని సన్నిహితులు సలహా ఇవ్వడంతో ఆంధ్రప్రభ పత్రికలో విలేకరిగా చేరారు. ఆ తర్వాత ఆంధ్ర సచిత్ర వార పత్రికలో శీర్షికలు రాసేందుకు చేరారు. 1956 నుంచి 16 ఏళ్ళపాటు పాత్రికేయ వృత్తిలోనే కొనసాగారు. 

ఆంధప్రత్రికలో ఉండగానే ఆయన రాసిన వ్యాసాలు, శీర్షికలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అలా ఎన్‌.టి.రామారావు దృష్టిలో పడ్డారు వేటూరి. సినిమాల్లో పాటలు రాస్తే బాగుంటుందని ఆయన ప్రోత్సహించారు. ఆ విధంగా తొలిసారి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఓ సీతకథ చిత్రంలో భారతనారి చరితము అనే హరికథ రాశారు. అలా చిత్ర రంగ ప్రవేశం చేసిన వేటూరికి రెండో అవకాశంగా ఎన్‌.టి.రామారావు హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన అడవిరాముడు చిత్రంలో అన్ని పాటలూ రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమాలోని పాటలతో ఒక్కసారిగా వేటూరి సుందరరామ్మూర్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలోనే పంతులమ్మ, సిరిసిరిమువ్వ చిత్రాల్లో అన్ని పాటలు రాశారు వేటూరి. సిరిసిరిమువ్వ చిత్రానికి జంధ్యాలతో కలిసి మాటలు కూడా రాశారు వేటూరి. 

1980లో కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం చిత్రంలోని పాటలతో ఒక్కసారిగా వేటూరి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం.. ఇలా ఎన్నో సినిమాల్లో తరాల తరబడి గుర్తుపెట్టుకునే పాటలు రాశారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... అనే పాటకి 1994వ సంవత్సరానికి గాను ఈ పురస్కారం వచ్చింది. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన భాషా హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు వేటూరి సుందరరామ్మూర్తి. ఇది కాక ఆయనకు ఎన్నో నంది అవార్డులు, ఇతర పురస్కారాలు లభించాయి. 

ఒక తరహా పాటలు కాకుండా ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగల ప్రతిభ కలిగిన వేటూరి రచించిన కొన్ని గీతాల గురించి చెప్పాలంటే.. కృషి వుంటే మనుషులు రుషులౌతారు, మానసవీణా మధుగీతం, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, రaుమ్మంది నాదం.. సై అంది పాదం, కొమ్మ కొమ్మకో సన్నాయి.., శంకరాభరణం చిత్రంలోని అన్ని పాటలు, రాగాల పల్లకిలో కోయిలమ్మా, ఆకాశ దేశాన.. ఆషాఢ మాసానా.., కిన్నెరసారి వచ్చిందమ్మా వెన్నెల పైటేసి, వెన్నెల్లో గోదారి అందం, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో, గీతాంజలి చిత్రంలోని అన్ని పాటలు, జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అన్ని పాటలు, పావురానికి పంజరానికి, ఎన్నెన్నో అందాలు, ఓ ప్రేమా నా ప్రేమా, జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే, ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకు, సఖియా చెలియా.. ఇలా చెప్పుకుంటూ పోతే వేటూరి కలం నుండి జాలువారిన మధురగీతాల్లో ఇవి మచ్చు తునకలు మాత్రమే. తెలుగు సినిమాకి వేటూరి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్‌, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో 2011లో వచ్చిన బద్రినాథ్‌ చిత్రంలో ఓంకారేశ్వరి.. వేటూరి రాసిన చివరి పాట. ఈ సినిమా విడుదల కావడానికి సంవత్సరం ముందు 2010 మే 22న 75 ఏళ్ళ వయసులో గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు వేటూరి సుందరరామ్మూర్తి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.