సామాన్యుడి నుంచి ప్రధాన మంత్రి వరకు ఈ నవ్వుల రారాజు అభిమానులే!
on Jan 26, 2026
నటకిరీటి రాజేంద్రప్రసాద్.. ఆరోగ్యకరమైన హాస్యానికి ఆయన చిరునామా. తెరపై ఆయన కనిపిస్తే చాలు నవ్వులు మొదలవుతాయి. హాస్యాన్ని స్టార్ హీరోలకు సమానంగా తీసుకెళ్లిన ఘనత రాజేంద్రప్రసాద్‌కి దక్కుతుంది. దివంగత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ఓ సందర్భంలో తను రాజేంద్రప్రసాద్ అభిమానినని, ఆయన సినిమాలు తరచూ చూస్తుంటానని ప్రత్యేకంగా చెప్పడం రాజేంద్రుడి ప్రతిభకు నిదర్శనంగా చెప్ప్పుకోవచ్చు. కేవలం హాస్య ప్రధాన పాత్రలకే పరిమితం కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించగల సమర్థుడు ఈ రాజేంద్రుడు. నవ్వు ఎంత ఆరోగ్యమో అందరికీ తెలిసిందే. అలాంటి ఆరోగ్య మంత్రాన్ని ప్రేక్షకులకు ఉపదేశించి వారికి మానసిక ప్రశాంతత కలిగించడంలో రాజేంద్రప్రసాద్ పోషించిన పాత్ర అద్వితీయమని చెప్పాలి.
49 ఏళ్ల తన సినీ ప్రయాణంలో 300కిపైగా సినిమాల్లో అన్నిరకాల పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అంతేకాదు, 2009లో ‘క్విక్‌గన్ మురుగన’ అనే ఇంగ్లీషు చిత్రంతో అంతర్జాతీయంగా కూడా పరిచయమయ్యారు. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా నటనపై ఉన్న ఆసక్తితో మద్రాస్‌లోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటనకు సాన పెట్టారు. ముఖ్యంగా మైమ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వంటి నటులకు ఇన్‌స్టిట్యూట్‌లో క్లాసులు తీసుకున్నారు.
సినిమాల్లో అవకాశాలు సంపాదించేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. పస్తులతో కాలం వెళ్లదీసిన రోజులున్నాయి. నిరాశ, నిస్పహలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తరుణంలో డబ్బింగ్ చెప్పే అవకాశం రావడంతో మొదటి అడుగు అక్కడ వేశారు రాజేంద్రప్రసాద్. డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి దాదాపు 200 సినిమాలకు తన గాత్రాన్ని అందించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘స్నేహం’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారు.
ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మించిన ‘ప్రేమించు పెళ్లాడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రాజేంద్రప్రసాద్. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వంశీతో మంచి అనుబంధం ఏర్పడడంతో లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల వంటి బ్లాక్‌బస్టర్స్‌లో నటించారు. దాంతో తిరుగులేని కామెడీ హీరోగా స్థిరపడిపోయారు. ఆ తర్వాత జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఇ.వి.వి.సత్యనారాయణ, ఎస్.వి.కష్ణారెడ్డి వంటి దర్శకుల సినిమాల్లో నటించి కామెడీ హీరోగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.
హాస్య పాత్రýతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఎర్రమందారం, పుణ్యస్త్రీ, ముత్యమంత ముద్దు వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లోనూ రాణించారు. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వంటి సినిమాల్లో బరువైన పాత్రలు పోషించి ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన రాజేంద్రప్రసాద్.. ఎర్రమందారం, ఆ నలుగురు చిత్రాలకిగాను ఉత్తమ నటుడిగా, మేడమ్ చిత్రానికి స్పెషల్ జ్యూరీ, టామీ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం రాజేంద్రప్రసాద్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



