సినీ రంగంలోనే కాదు, వ్యాపార రంగంలోనూ అద్వితీయ విజయాలు అందుకున్న అజాత శత్రువు!
on Jan 26, 2026
సినీ పరిశ్రమకు రావాలనే ఆలోచన కూడా లేని కొందరు ఆ తర్వాతి కాలంలో నటులుగా, సాంకేతిక నిపుణులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో మురళీమోహన్ ఒకరు. మంచి వ్యాపారవేత్త అవ్వాలన్నది ఆయన లక్ష్యం. ఆయన ప్రయాణం కూడా ఆ దిశగానే సాగింది. 23 ఏళ్ళ వయసులోనే విజయవాడలో బంధువులతో కలిసి ఎలక్ట్రికల్ మోటార్స్ వ్యాపారం మొదలుపెట్టారు. అందులో బాగా రాణించి వ్యాపారాన్ని బాగా వద్దిలోకి తీసుకొచ్చారు. ఖాళీ సమయాల్లో మిత్రులతో కలిసి నాటకాలు వేసేవారు. అయితే సినిమాల్లోకి వెళ్లాలి అనే ఆలోచన లేదు. వ్యాపారంలోనే ముందుకు వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
మురళీమోహన్ మిత్రులు మాత్రం సినిమాల్లోకి వెళ్ళమని పదే పదే చెప్పేవారు. అలా ఒకసారి బలవంతంగా ఫోటో సెషన్ చేయించారు. పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 31 ఏళ్ళ వయసులో 1973లో విడుదలైన ‘జగమేమాయ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు మురళీమోహన్. ఇక అక్కడి నుంచి అవకాశాలు రావడం మొదలైంది. హీరోగానే కాకుండా సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు.
దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘తిరుపతి’, ‘భారతంలో ఒక అమ్మాయి’, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమరదీపం’, ‘జ్యోతి’, ‘కల్పన’, ‘ఆమె కథ’, ‘ప్రేమలేఖలు’ తదితర చిత్రాలతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. హీరోగా నటిస్తూనే ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణ వంటి హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. 53 ఏళ్ల కెరీర్‌లో 350కి పైగా సినిమాలు చేశారు. ‘ఓ తండ్రి తీర్పు’ సినిమాకిగానూ ఉత్తమ నటుడిగా, ‘ప్రేమించు’, ‘వేగు చుక్కలు’ సినిమాలకిగానూ ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాల్ని అందుకున్నారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ 25కిపైగా సినిమాలు చేశారు మురళీమోహన్.
సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన దష్టి వ్యాపారం పైనే ఉండేది. హీరో శోభన్‌బాబు ఇచ్చిన సలహా మేరకు భూమిపై పెట్టుబడి పెట్టారు. జయభేరి గ్రూప్‌ని ప్రారంభించి రియల్ ఎస్టేట్ రంగంలో జయభేరి మోగించారు. సినిమాలు, వ్యాపారమే కాకుండా రాజకీయాల్లోనూ ప్రవేశించారు. 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా, 2014లో తెలుగు దేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు. ఎక్కువగా జయభేరి గ్రూప్‌పైనే దష్టి పెట్టారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో విశేషంగా రాణించి సేవలందించిన మురళీమోహన్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



