వడ్డే నవీన్, రాశి 'స్నేహితులు'కి పాతికేళ్ళు.. ఏయే భాషల్లో రీమేక్ అయ్యిందో తెలుసా!
on Sep 11, 2023

వడ్డే నవీన్, రాశిది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలో 'స్నేహితులు' ఒకటి. 'సెంటిమెంట్ సినిమాల స్పెషలిస్ట్' ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాలో మరో హీరోయిన్ గా సాక్షి శివానంద్ సందడి చేసింది. ఆనంద్, సుధాకర్, ఆహుతి ప్రసాద్, నర్రా వెంకటేశ్వరరావు, చలపతి రావు, సత్య ప్రకాశ్, రంగనాథ్, వేణుమాధవ్, తిరుపతి ప్రకాశ్, బండ్ల గణేశ్, కళ్ళు చిదంబరం ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. అనుమానపు భర్త (ఆనంద్) కారణంగా వేధింపులకు గురైన మహాలక్ష్మి (రాశి) ఓ అమ్మాయికి.. మురళి (వడ్డే నవీన్) అనే యువకుడు ఎలా అండగా నిలిచాడు? మురళి, మహాలక్ష్మి గతమేంటి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కథాబలమున్న చిత్రంగా జననీరాజనాలు అందుకున్న ఈ సినిమాకి పోసాని కృష్ణమురళి అందించిన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కోటి సంగీత సారథ్యంలో రూపొందిన గీతాలన్ని అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "మల్లికవో మేనకవో", "పూచే పువ్వుకి ఎన్నో ఘుమఘుమలు", "ఓ గజ్జెల గుమ్మా", "ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా", "ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు.. అన్ని కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు.." ఇలా అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. బద్వేల్ శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన 'స్నేహితులు'.. 'ఆశయిల్ ఒరు కడిదమ్' (ప్రశాంత్, కౌసల్య, చాందిని) పేరుతో తమిళంలో, 'స్నేహ' (వి. రవిచంద్రన్, రాశి, రమ్యకృష్ణ) పేరుతో కన్నడంలో రీమేక్ అయింది. 1998 సెప్టెంబర్ 11న జనం ముందు నిలిచిన 'స్నేహితులు'.. నేటితో 25 ఏళ్ళు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



