Home

»

Bollywood News

450 కోట్ల సినిమా.. ఎవరూ పట్టించుకోలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.!

Nov 20, 2026 3:49PM

సినిమా హిట్‌ కావాలంటే స్టార్‌ నటులు ఉండాలి.. భారీ బడ్జెట్‌ పెట్టాలి.. పెద్ద నిర్మాణ సంస్థ అండ ఉండాలి. ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉన్న ఈ అభిప్రాయాలను ఓ చిన్న సినిమా తిరగరాసింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన ‘హనుమాన్‌ అంశ్‌’ సంచలన విజయం సాధించింది. కానీ ఇంతటి విజయాన్ని అందుకున్నా బాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థలు కనీసం స్పందించలేదని ఆ సినిమా దర్శకుడు విశాల్‌ చతుర్వేది అసంతృప్తి వ్యక్తం చేశారు.

నీమ్‌ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన భక్తిరస చిత్రం ‘హనుమాన్‌ అంశ్‌’ ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైంది. ఎలాంటి భారీ ప్రచారం, స్టార్‌ కాస్ట్‌ లేకుండానే ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకుంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.452.86 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లోనే అతిపెద్ద బాక్సాఫీస్‌ సర్‌ప్రైజ్‌లలో ఒకటిగా నిలిచింది.

అయితే ఇంతటి విజయాన్ని సాధించినా ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి ఎలాంటి అభినందనలు రాలేదని దర్శకుడు విశాల్‌ చతుర్వేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెద్ద సినిమాలు విజయం సాధించినప్పుడు నిర్మాణ సంస్థలు అధికారిక ప్రకటనలు విడుదల చేస్తుంటాయని.. కానీ తన సినిమా విషయంలో ఒక్క పెద్ద నిర్మాణ సంస్థ కూడా స్పందించలేదని అన్నారు. చిన్న సినిమా కావడం, తనలాంటి కొత్త దర్శకుడు తెరకెక్కించడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని అభిప్రాయపడ్డారు.

వ్యక్తిగతంగా కలిసినప్పుడు చాలామంది సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారని, కానీ బహిరంగంగా అభినందించినవారు మాత్రం కొద్దిమందేనని చెప్పారు. వారిలో వరుణ్‌ ధావన్‌, మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఉన్నారని తెలిపారు. ఏ ప్రముఖ స్టూడియో కూడా తమ సినిమా విజయంపై అధికారిక ప్రకటన చేయలేదని తన అసంతృప్తిని బయటపెట్టారు.

ఇది కూడా చదవండి: కలెక్షన్లు ఎక్కువ.. ఫుట్‌ఫాల్స్ తక్కువ.. రామాయణ అసలు లెక్కలేంటి.?

అంతేకాదు.. సినిమా విజయానికి భారీ బడ్జెట్‌, స్టార్‌ నటులు, పెద్ద నిర్మాణ సంస్థలు తప్పనిసరి అనే అపోహను ‘హనుమాన్‌ అంశ్‌’ తొలగించిందని విశాల్‌ అన్నారు. సినిమా అనేది ప్రజలకు సంబంధించిన మాధ్యమమని, ప్రేక్షకులే సినిమా బాగుందో లేదో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. చివరికి ప్రేక్షకుల తీర్పే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే ‘హనుమాన్‌ అంశ్‌’ నవంబర్‌ 27 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలోనూ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

మీకు కూడా నచ్చవచ్చు: 
సమంతకు బాబు పుట్టాడు.. పేరు కూడా రివీల్‌ చేశారు.!
రాధికా ఆప్టే వివాదంపై కీర్తి సురేష్ క్లారిటీ.. అప్పుడెందుకు నవ్వానంటే.?

 

 

 

[Hanuman Ansh, Vishal Chaturvedi, Neem Karoli Baba, Bollywood]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com