‘ధూమ్4’ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన ఎన్టీఆర్ డైరెక్టర్!
on Jun 5, 2025
సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి. అలాంటివి యాక్షన్ సీక్వెన్స్‌ల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా సినిమాల్లో వచ్చే యాక్షన్ సీన్స్‌లో ఫైట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అలా కాకుండా బైక్ ఛేజ్, కార్ ఛేజ్‌లతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చిన సినిమా ‘ధూమ్’. యాక్షన్ మూవీస్‌లో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసిన సినిమా ఇది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సంజయ్ గాధ్వీ దర్శకత్వం వహించారు. యష్‌రాజ్ ఫిలింస్ ఈ అద్భుతమైన సిరీస్‌కి శ్రీకారం చుట్టింది. 11 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 2004లో విడుదలై ఘనవిజయం సాధించి 72 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో వెంటనే దీనికి సీక్వెల్‌గా ‘ధూమ్2’ ప్రారంభించారు. సంజయ్ గాధ్వీ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందింది. హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, బిపాసా బసు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2006లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేసింది.
‘ధూమ్2’ భారీ విజయాన్ని నమోదు చేయడంతో పార్ట్ 3 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. సంవత్సరాలు గడుస్తున్నా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎలా అప్‌డేట్ రాలేదు. ఒక దశలో సిరీస్ కొనసాగించే అవకాశం లేదనే వార్తలు కూడా వచ్చాయి. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ‘ధూమ్3’ ప్రారంభించారు. ఆమిర్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ విలన్‌గా నటించడం విశేషం. మొదటి రెండు భాగాలకు రైటింగ్ సైడ్ పనిచేసిన విజయ్‌కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రెండు సంవత్సరాల పాటు నిర్మాణం జరుపుకొని 2013లో విడుదలైన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. అయితే కమర్షియల్‌గా బాగానే వర్కవుట్ అయింది. 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 550 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా ‘ధూమ్4’పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్‌లో సినిమా విడుదలై దాదాపు 12 సంవత్సరాలవుతోంది. కానీ, ‘ధూమ్4’ గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
తాజాగా ‘ధూమ్4’కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్‌గా మారింది. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘వార్2’ నిర్మాణం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న అయాన్ ముఖర్జీకి ధూమ్4ను డైరెక్ట్ చేసే బాధ్యతను అప్పగించారని తెలుస్తోంది. వాస్తవానికి అయాన్.. ‘వార్2’ పూర్తయిన వెంటనే ‘బ్రహ్మాస్త్ర2’ స్టార్ట్ చెయ్యాలి. అయితే ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకే కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టాలని నిర్మాత కరణ్ జోహర్ నిర్ణయించుకున్నారు. వార్2, ధూమ్ సిరీస్‌లను నిర్మించేది యష్ రాజ్ ఫిలింసే కాబట్టి పార్ట్ 4కి అయాన్ ముఖర్జీకి ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే యానిమల్ చిత్రంతో ఫుల్ ఫామ్‌లో ఉన్న రణబీర్ కపూర్.. ధూమ్ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే అయాన్ డైరెక్ట్ చేస్తున్న వార్2పై మంచి బజ్ ఉంది. ఇప్పుడు ధూమ్4 వార్తల్లోకి రావడం, రణబీర్ కపూర్, అయాన్ కాంబినేషన్‌లో ఈ సినిమా ఉంటుందని తెలియడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అయితే రణబీర్ ప్రస్తుతం రామాయణం, లవ్ అండ్ వార్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే ధూమ్4 సెట్స్‌కి వచ్చే అవకాశం ఉంది. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికే చాలా కాలం పట్టేలా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



