English | Telugu

పెళ్లిరోజు భార్యకి యశ్వంత్ మాస్టర్ స్పెషల్ గిఫ్ట్

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' షో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా టాలెంట్ ఉన్న చాలా మంది డాన్సర్లకు అవకాశాలు వచ్చాయి. ఈ షో ద్వారానే యశ్వంత్ మాస్టర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొరియోగ్రాఫర్ గా సినిమాలకు కూడా పని చేస్తున్నారు. అలానే కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. యశ్వంత్ తన చిన్ననాటి స్నేహితురాలు వర్షను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరికీ పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా తన భార్యకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు యశ్వంత్. ఆ గిఫ్ట్ ఏంటంటే.. 'చౌ చౌ' అనే జాతికి చెందిన ఓ కుక్కపిల్లను యశ్వంత్ తన భార్యకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు యశ్వంత్. ఇప్పటికే వీరి దగ్గర రెండు కుక్కలు ఉన్నాయి. ఇది మూడోదన్న మాట. దానికి చెర్రీ అని పేరు కూడా పెట్టేశారు.

ఇక సోషల్ మీడియాలో అభిమానులు, ఇతర సెలబ్రిటీల నుండి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యశ్వంత్ భార్య వర్ష.. ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తోంది. అయితే అప్పుడప్పుడు తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది వర్ష. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు, డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇప్పటికే 'డాన్స్ ప్లస్' షోతో పాటు 'క్యాష్' అలానే 'వావ్' లాంటి కొన్ని టీవీ షోలలో వీరిద్దరూ అతిథులుగా కనిపించారు.