English | Telugu

ఎవరి చావుకు కారణం కావొద్దు...

సంక్రాంతి వస్తోందంటే చాలు పతంగులు కూడా ఎగరేయొచ్చని చిన్నా పెద్దా అంతా ఆశ పడుతూ ఉంటారు... ఐతే ఈ పతంగులు ఎగరేయడం మాట అలా ఉంచితే ఆ పతంగులు కట్టడానికి వాడే నైలాన్ మాంజ మాత్రం ఎన్నో పక్షుల ప్రాణాలను అప్పుడప్పుడు మనుషుల ప్రాణాలను కూడా తీసేస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ వస్తోంది.

దీంతో అటవీ శాఖ అధికారులు అందరినీ అలెర్ట్ చేస్తున్నారు. ఇక సినీ సెలెబ్స్ అందులోనూ కొంత మంది పెట్ లవర్స్, బర్డ్ లవర్స్ కూడా వీటి మీద సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. రీసెంట్ గా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్, నటి సదా కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇలాంటిదే ఒకటి పోస్ట్ చేసింది. "రాబోయే సంక్రాంతి పండగ నాడు వేరే వారి బాధకు, నొప్పికి, వారి మరణానికి మీరు కారణం కావొద్దు" అని అలెర్ట్ మెసేజ్ ఇచ్చింది. సంక్రాంతి వస్తోందంటే చాలు ఈవిషయం గురించి పెద్ద యుద్ధమే జరుగుతుంది.

ఎంత అవగాహన కల్పించిన కొంతమంది లైట్ తీసుకుంటారు... "పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దాం" అనే నినాదంతో పండగ జరుపుకోవాలని అటవీశాఖ ప్రతీ ఏడాది పిలుపునిస్తూనే ఉంటుంది. నైలాన్, సింథటిక్ మాంజా దాన్నే చైనీస్ మాంజా అని కూడా అంటాం కదా. పతంగులను ఎగుర వేసేందుకు ఉపయోగించే చైనీస్ మాంజా కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం మనకు తెలుసు. కేంద్ర పర్యావరణ చట్టం ప్రకారం చైనీస్ మాంజా వాడకాన్ని నిషేధించింది ప్రభుత్వం. ఎందుకంటే పండగ తర్వాత ఎక్కడి దారాలు అక్కడే వేళ్ళాడుతూ ఉండిపోతుండడం వలన పక్షులు వాటికి చిక్కుకుని చనిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మనుషులు కూడా గాయపడుతున్నారు. చైనీస్ మాంజా బదులు సాంప్రదాయ కాటన్ దారాలను పతంగుల కోసం వాడాలని అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మన వల్ల ఎవరికీ హానీ జరగకుండా చూసుకునే ఉద్దేశమే పండగ లక్ష్యం అని సదా చెప్పకనే చెప్పింది తన సందేశం ద్వారా..