English | Telugu
వచ్చింది జాతిరత్నాలు కాదు.. జాతి మొగుళ్లు!
Updated : Apr 29, 2021
కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో ముందుంటారు మెగాబ్రదర్ నాగబాబు. 'జబర్దస్త్' షో సమయంలో చాలా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం చేసి వాళ్లను ప్రోత్సహించిన నాగబాబు.. ఆ షో నుండి బయటకి వచ్చిన తరువాత జీతెలుగులో 'అదిరింది' షోతో కొన్నాళ్ల పాటు అలరించారు. అయితే ఆ షోని ఎక్కువకాలం కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తరువాత 'ఖుషీఖుషీగా ' అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కమెడియన్లతో కామెడీ షో నిర్వహించారు నాగబాబు. అయితే ఇప్పుడు ఎక్కువమందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో యూట్యూబ్ పై ఫోకస్ పెట్టారు.
'అదిరింది' కామెడీ షోతో పాపులర్ అయిన సద్దాం, యాదమ్మ రాజు, భాస్కర్, హరిలతో 'బస్తీ బాయ్స్' అనే వెబ్ సిరీస్ ను మొదలుపెట్టారు. ఈ సిరీస్ కి నాగబాబు కాన్సెప్ట్ అందించి.. ఇన్ఫినిటంతో కలిసి నిర్మించారు. తాజాగా 'బస్తీ బాయ్స్' ఫస్ట్ ఎపిసోడ్‌ను నాగబాబు యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు.. "వచ్చింది జాతి రత్నాలు కాదు.. జాతి మొగుళ్లు" అంటూ తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టి యూట్యూబ్ లింక్ ని షేర్ చేశారు.
ఈ స్కిట్ లో నటించిన సద్దాం.. తనను తానే బాబు అని పేరు పెట్టేసుకొని.. బిల్డప్ ఇచ్చాడు. "యూట్యూబ్‌లో ఒక్కొక్క ట్యూబ్‌లు పగిలిపోతాయ్. వారం అంతా యూట్యూబ్‌లో ట్యూబ్‌లు పగలగొట్టేస్తాం" అంటూ హడావిడి చేస్తున్నాడు. పదహారు నిమిషాల నిడివితో ఉన్న 'బస్తీ బాయ్స్' వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ లో సద్దాం, భాస్కర్ లు కనిపించారు. తొలి ఎపిసోడ్ చాలా కామెడీతో అలరించింది. ప్రస్తుతం 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో నంబర్ వన్‌గా ట్రెండ్ అవుతున్నారు 'బస్తీ బాయ్స్'.