English | Telugu

ఈ ఏడాదే ముక్కు అవినాశ్ పెళ్లి.. అమ్మాయి ఎవ‌రంటే...

ముక్కు అవినాశ్‌, అరియానా గ్లోరీ అనుబంధం గురించి తెలియ‌నివారెవ‌రు? బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న‌ప్ప‌ట్నుంచీ ఆ ఇద్ద‌రూ స‌న్నిహితంగా మెల‌గుతూ, క‌లిసి టూర్లకు వెళ్తూ, తోటల్లో షికార్లు చేస్తూ, వాటి ఫొటోలు, వీడియోలు షేర్లు చేస్తూ త‌మ మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌నే అభిప్రాయాన్ని క‌లిగిస్తూ వ‌స్తున్నారు. కొంతమంది ఇది కేవ‌లం వినోదం కోస‌మే చేస్తున్న‌దిగా తీసేస్తుంటే, చాలామంది వాళ్ల‌మ‌ధ్య అనుబంధం పెన‌వేసుకుంద‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

వారి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా సూప‌ర్‌గా పండుతుండ‌టంతో, వివిధ షోల‌లో వారిని జంట‌గా చూపిస్తున్నారు నిర్వాహ‌కులు, కామెడీ స్కిట్స్ అయినా, సాంగ్స్‌లో డాన్స్ అయినా ఇర‌గ‌దీసేస్తున్నారు అవినాష్‌, అరియానా. ఇటీవ‌ల మా స్టార్ చాన‌ల్‌లో ప్ర‌సార‌మైన 'మా ఉగాది వేడుక‌'లో "అబ్బా.. ఇది ఏమి వాన" రెయిన్ సాంగ్‌కు ఆ ఇద్ద‌రూ ఇచ్చిన ప‌ర్ఫార్మెన్స్ చూసి అంద‌రి మ‌తులూ పోయాయి. అంతలా ఆ ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అదిరింది. ఆ ఇద్ద‌రూ ల‌వ్ బ‌ర్డ్స్ కావ‌డం వ‌ల్లే ఆ పాట‌లో జీవించారు అనే కామెంట్స్ వినిపించాయి.

కాగా 2021లో తను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ఇటీవ‌ల ఓపెన్ అయ్యాడు అవినాష్‌. అయితే అమ్మాయి ఎవ‌ర‌నే విష‌యాన్ని చెప్ప‌కుండా స‌స్పెన్స్‌లో పెట్టాడు. దాంతో అమ్మాయి అరియానే అయివుంటుంద‌ని చాలామంది ఫిక్స‌యిపోయారు. ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడంటే క‌చ్చితంగా అమ్మాయిని ఇప్ప‌టికే చూసుకొని ఉంటాడ‌నే మాట వినిపిస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహానికి మించిన బంధం ఉంద‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంద‌నీ, అలాంట‌ప్పుడు ఆ ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంద‌ని కూడా అంటున్నారు. చివ‌రికి వారి క‌థ ఏ తీరానికి చేరుతుందో చూడాలి.