English | Telugu
నాగబాబును నమ్ముకున్న 'బస్తీ బాయ్స్' సక్సెస్ అవుతారా?
Updated : Apr 22, 2021
జబర్దస్త్ షో నుంచి తనంతట తాను బయటకు వచ్చేసిన నాగబాబు, దానికి పోటీగా 'అదిరింది' అనే షోను స్టార్ట్ చేశారు. కానీ జనం దాన్ని సరిగా ఆదరించకపోవడంతో చేసేది లేక దాన్ని ఆపేశారు. నాగబాబును నమ్ముకొని 'జబర్దస్త్' నుంచి వచ్చిన కొంతమంది కమెడియన్లకు తోడు, కొత్తగా 'అదిరింది' ద్వారా పరిచయమైన కమెడియన్లకు దిక్కు తోచకుండా పోయింది. అయితే నాగబాబు వారిని వదిలెయ్యలేదు. "నాగబాబు కొణిదెల ఒరిజినల్స్" అనే ఓ యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసి, తనను నమ్ముకున్న కమెడియన్లతో స్కిట్స్ చేయిస్తూ, వాటిని ఆ చానల్‌లో అప్‌లోడ్ చేస్తూ వస్తున్నారు.
లేటెస్ట్‌గా ఆయన 'బస్తీ బాయ్స్' అనే వెబ్ సిరీస్‌ను కూడా తీశారు. బుల్లెట్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ నలుగురు బస్తీ బాయ్స్ చుట్టూ నడుస్తుంది. టైటిల్ రోల్స్‌లో భాస్కర్, హరి, సద్దాం, యాదమ్మ రాజు నటించారు. వాళ్లు చేసే హంగామా, వాళ్లు చెప్పే డైలాగ్స్ ఆడియెన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. బుధవారం రిలీజ్ చేసిన ట్రైలర్‌ను చూస్తే అడల్ట్ జోకులు, అడల్ట్ సీన్లు కూడా ఈ సిరీస్‌లో భాగమని తెలుస్తోంది.
ఓటీటీలో ఇలాంటి వాటికి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు అమ్మకుండా తన నాగబాబు కొణిదెల ఒరిజినల్స్ చానల్‌లోనే 'బస్తీ బాయ్స్'ను రిలీజ్ చేస్తున్నట్లు నాగబాబు వెల్లడించారు. "టీవీ తరహాలోనే బాగా ఖర్చుపెట్టి ఈ సిరీస్ తీశాం. దీని కాన్సెప్టును నేను, బుల్లెట్ భాస్కర్ కలిసి తయారుచేశాం. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ చార్జీలు లేకుండా ఉచితంగానే దీన్ని చూడొచ్చు. ఈ సిరీస్ హిట్టయితే దీనికి మరిన్ని సీజన్లు తీస్తాం." అని నాగబాబు చెప్పారు.
ఏప్రిల్ 27 సాయంత్రం 6 గంటలకు 'బస్తీ బాయ్స్' సిరీస్ అందుబాటులోకి రానున్నది. ఈ సిరీస్ అయినా నాగబాబుకు సక్సెస్ తెస్తుందేమో చూడాలి. నాగబాబు కానీ, బుల్లెట్ భాస్కర్ కానీ ఈ సిరీస్‌లో నటించినట్లు లేదు. ఎందుకంటే ట్రైలర్‌లో వాళ్లు కనిపించలేదు.