English | Telugu
మోనిత రి-ఎంట్రీ.. కథ ఇక మామూలుగా ఉండదు!
Updated : Jul 26, 2022
`కార్తీకదీపం` సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్కలతో పాటు తన విలనిజంతో మంచి క్రేజ్ ని తీసుకొచ్చిన పాత్ర మోనిత. ప్రతీ ఎపిసోడ్ ని తన కుట్రలతో కీలక మలుపులు తిప్పించింది. వంటలక్కని మోనిత బాధలు పెడుతున్న తీరుకు చాలా మంది ఈ పాత్ర ఎంట్రీ ఇవ్వగానే శాపనార్థాలు పెట్టేవారట. అంతలా తన పాత్రతో అందరిని కట్టిపడేసింది మోనిత.
డాక్టర్ బాబుతో రాక్షస ప్రేమ.. అనూహ్య పరిస్థితుల్లో డాక్టర్ బాబుని మోసం చేసి తల్లి కావడం.. దాన్ని అడ్డంపెట్టుకుని డాక్టర్ బాబుని సొంతం చేసుకోవాలని కుట్రలు చేయడంతో `కార్తీక దీపం` రసవత్తర మలుపులు తిరిగింది. టాప్ 1 రేటింగ్‌తో రికార్డు సృష్టించింది. కథ మొత్తం కార్తీక్, దీప, మోనిత మధ్యే సాగింది. దీంతో ఈ సీరియల్ టాప్ లో నిలిచి రికార్డు సృష్టించింది.
అయితే తాజాగా వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలని ఎండ్ చేసి వారి తరువాత తరంతో సీరియల్ ని నడిపిస్తున్నారు. అయితే రేటింగ్ మరీ దారుణంగా పడిపోయింది. దీంతో నెంబర్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని సీరియల్ మేకర్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వర్కవుట్ కావడం లేదు. ఈ నేపథ్యంలో మోనిత పాత్రని రీఎంట్రీ ఇప్పిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలని మళ్లీ రంగంలోకి దింపడం కుదరని పని కావడంతో మోనితనే మళ్లీ ఓల్డ్ పాత్రలో దించేయాలని భావిస్తున్నారట.
డాక్టర్ బాబు కారణంగా తనకు కొడుకు వున్న విషయం తెలిసిందే. ఈ పాత్రని హిమ, శౌర్య రవ్వా ఇడ్లీ పేరుతో పిలుచుకుంటున్నారు. ఆ పాత్రని మొత్తానికి అనాథని చేశారు. తన కొడుకుని ఇంటికి చేర్చాలని, తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలనే కోణంలో మోనిత పాత్రని రంగంలోకి దింపి సౌందర్యపై కుట్రలు చేయించడం వంటివి మొదలు పెట్టొచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఇందుకు మోనిత పాత్రలో నటించిన శోభాశెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది.