English | Telugu

కాకి కోకిలయ్యింది అంటూ శ్రీలేఖకు కంప్లిమెంట్ ఇచ్చిన బాలు

సాయికుమార్ హోస్ట్ గా చేస్తున్న "వావ్" షో ప్రతీ వారం అలా హాయిగా సాగిపోతూ ఉంది. ఇక ఈ వారం ఎపిసోడ్ కి ఎంఎం.శ్రీలేఖ, అదితి భావరాజు, సాందీప్, కారుణ్య విచ్చేసారు. ఇక శ్రీలేఖ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గా 80 సినిమాలు చేశారు. సింగర్ గా 4 వేల పాటలు పాడారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషాల్లో పాడారు. శ్రీలేఖ తన ఏడేళ్ల వయసులో సంగీతం నేర్చుకోవాలని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కర్ణాటక నుంచి పారిపోయి వాళ్ల పెదనాన్న ఇంటికి వచ్చేశారట. ఆ తర్వాత శ్రీలేఖను వాళ్ళ పెదనాన్న బాలు గారి దగ్గరకు తీసుకెళ్లి "మా అమ్మాయి పాడుతుంది మీరు కూడా ఒకసారి వినండి" అనేసరికి బాలు గారు "ఏది ఒక పాట పాడమ్మా" అన్నారట. వెంటనే "శంకరా" అంటూ గాడిద గొంతును, కాకి గొంతును మిక్సీలో వేస్తే ఎలా ఉంటుందో ఆ గొంతుతో పాడేసాను అని చెప్పారు శ్రీలేఖ.

బాలుగారు ఇక ఏమి అనలేక "మీరు పెద్దవారు మిమ్మల్ని ఏమీ అనలేను వెంటనే ఈ అమ్మాయిని ఇక్కడనుంచి తీసుకెళ్లిపొండి లేదంటే నాకు వచ్చిన సంగీతాన్ని కూడా నేను మర్చిపోయేలా ఉన్నాను..ఈమెకు సంగీతం నేను నేర్పలేను" అంటూ మా పెదనాన్నకు చెప్పేసరికి ఆయన అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చేశారు అని అన్నారు శ్రీలేఖ. వెళ్తూ వెళ్తూ శ్రీలేఖ బాలుగారికి ఒక లుక్ ఇచ్చారట. "నీకు రాదు నేర్పడం..నేను చాలా అద్భుతంగా పాడతాను" అంటూ ఒక లుక్ ఇచ్చేసి సీరియస్ గా వచ్చేసాను. కట్ చేస్తే ఐదేళ్ల తర్వాత బాలుగారితో కలిసి శ్రీలేఖ " ఆయనకిద్దరు" మూవీలో "అందాలమ్మో అందాలు" అనే ఒక డ్యూయెట్ పాడారట. "నేను పాడుతూ ఉంటే బాలుగారు ఒక పక్కన కూర్చుని అసలేం పాడుతోంది అనుకుంటూ అలా చూస్తూ ఉన్నారు.

అసలు ఎవరు పిలిచారు ఈ అమ్మాయిని అన్నట్టుగా చూసి వెంటనే కోటి గారిని కూడా తిట్టేశారట బాలు గారు. అసలెందుకు ఈ అమ్మాయిని పిలిచావ్ " అని. ఇక కోటిగారేమో "కొంచెం ఓపిక పట్టండి సర్..ఈ అమ్మాయి బాగా పాడుతోంది" అనేసరికి బాలుగారు విని తర్వాత నాతో కలిసి ఆ పాటను పూర్తి చేశారు. ఆ తరువాత బయటికి వచ్చి నాతో అన్న మొదటి మాట "కాకి కోకిలయ్యింది" అని . ఆ టైంలో అది నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పారు శ్రీలేఖ.