English | Telugu

చ‌ర్ల‌ప‌ల్లి జైలుకి 'కోయిల‌మ్మ‌' న‌టుడు!

'కోయిల‌మ్మ‌' సీరియ‌ల్‌లో న‌టించిన అమ‌ర్ శ‌శాంక్‌ అలియాస్ స‌మీర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవ‌ల తాగి ఓ న్యూస్ రిపోర్ట‌ర్‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొని వార్త‌ల్లో నిలిచిన అమ‌ర్‌ని తాజాగా అరెస్ట్ చేసి పోలీసులు చ‌ర్ల‌ప‌ల్లి జైలుకి త‌ర‌లించ‌డం బుల్లితెర వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. గ‌త నెల 27న అమ‌ర్‌పై ఇద్ద‌రు యువ‌తులు లైంగిక ఆరోప‌ణ‌లు చేస్తూ పోలీసుల్ని ఆశ్ర‌యించారు.

దీంతో రాయ‌దుర్గం పోలీసులు అమ‌ర్‌ని అదుపులోకి తీసుకుని విచార‌ణ అనంత‌రం కూక‌ట్‌ప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి అమ‌ర్‌కి రిమాండ్‌ విధించారు. దీంతో అత‌న్ని పోలీసులు చ‌ర్ల‌ప‌ల్లి జైలుకి త‌ర‌లించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే ఈ వివాదంపై అమ‌ర్ వాద‌న మ‌రోలా వుంది.

ఓ టీవీ రిపోర్ట‌ర్ కావాల‌నే త‌న‌ని ఇలా ఇరికించింద‌ని, ఓ రౌడీ షీట‌ర్‌తో బెదిరించ‌డ‌మే కాకుండా మ‌రో ఇద్ద‌రు యువ‌తుల్ని తీసుకొచ్చి ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం త‌న‌పై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేసింద‌ని అమ‌ర్ ఆరోపించారు. కానీ తాజాగా వివాదంలో అమ‌ర్‌దే త‌ప్పంటూ అత‌నికి కూక‌ట్‌ప‌ల్లి కోర్టు రిమాండ్‌ విధించ‌డంతో బుల్లితెర‌ వ‌ర్గాలు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి.