English | Telugu
జబర్దస్త్ వ్యాపారం అంటూ కిరాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్
Updated : Jul 7, 2022
జబర్దస్త్ కామెడీ షో చాలా మంది కమెడియన్ లని వెలుగులోకి తీసుకొచ్చింది. అంతే కాకుండా చాలా వరకు విమర్శలని కూడా ఎదుర్కొంది. కమెడియన్ లతో చేయించుకునే అగ్రిమెంట్ లు వివాదాస్పమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ మల్లెమాల అగ్రిమెంట్ లపై నాగబాబు తన షోలో సెటైర్లు వేస్తూనే వున్నారు. తాజాగా కిరాక్ ఆర్పీ కూడా మల్లెమాలపై సంచలన కామెంట్ లు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జబర్దస్త్ ని వీడిన కిరాక్ ఆర్పీ ప్రస్తుతం నాగబాబు నిర్వహిస్తున్న `కామెడీ స్టార్స్ ధమాకా`తో పాటు పలు ప్రత్యేక షోలలో కనిపించి తనదైన పంథాలో నవ్విస్తున్నాడు. ఇటీవలే లక్ష్మీ ప్రసన్న అనే యువతిని ప్రేమించి పెళ్లిచేసుకోబోతున్నాడు. ఇటీవలే వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు కూడా పాల్గొని ఇద్దరిని ఆశీర్వదించారు. ఇదిలా వుంటే హోటల్ లో సర్వర్ గా పని చేసిన స్థాయి నుంచి ప్రస్తుతం హైదరాబాద్ లో సొంత ఇట్లు తీసుకునే స్థాయికి ఎదిగిన కిరాక్ ఆర్పీ గత కొన్ని నెలలుగా నాగబాబు నిర్వహిస్తున్న `కామెడీ స్టార్స్ ధమాకా` షోలో నవ్విస్తున్నాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ తో పాటు మల్లెమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మల్లెమాల నిర్మాత శ్యామ్ ప్రసాదరెడ్డి ఓ వ్యాపారి అని, నాగబాబు దేవుడు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే నాగబాబు పేరు పచ్చబొట్టు వేయించుకున్నానన్నాడు. నాకు అన్ని విధాలుగా నాగబాబుగారు అండగా నిలిచారని, అయితే శ్యామ్ ప్రసాదరెడ్డి మాత్రం పక్కా వ్యాపారిలా నీకెంత నాకెంత అనే లెక్కలు వేసేవారని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆర్పీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.