English | Telugu

Karthika Deepam2 : పిల్లలు అబద్ధాలు చెప్పరు.. నేనే కదా నిన్ను తీసుకొచ్చాను, థాంక్యూ సో మచ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -69 లో.. కార్తిక్ కి శౌర్య కాల్ చేస్తుంది. ఇక అదే సమయంలో అక్కడికి జ్యోత్స్న వచ్చి.. శౌర్య ఫోన్ తీసుకొని వింటుంది. ఊరికే ఫోన్ మాట్లాడుకోవడం కాదు.. నీకు కానీ మీ అమ్మకి కానీ ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయమని కార్తిక్ అంటాడు. ఆ మాట జోత్స్స వినేస్తుంది. ఇంతలో దీప వచ్చి.. శౌర్య ఎవరితో మాట్లాడుతుంది.. ఆ ఫోన్ జోత్స్న ఎందుకు తీసుకుందని ఆలోచిస్తుంటుంది. మీ అమ్మకి ఆత్మాభిమానం ఎక్కువ.. ఏదీ అడగదు.. మీ అమ్మకి ఏం కావాలన్నా నువ్వే నాతో చెప్తుండాలని కార్తిక్ అంటాడు. ఆ మాట విన్న జోత్స్న.. నీ నుంచి ఇది అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు బావా అని అనుకుంటుంది.

ఏంటీ జో.. కార్తీక్ ఏమంటున్నాడు అని శౌర్య అడుగుతుంది. నువ్వే మాట్లాడమని ఫోన్ ని శౌర్యకి ఇచ్చేస్తుంది జోత్స్న. అప్పుడు దీపకి విషయం అర్థమవుతుంది. కార్తీక్ బాబుకి శౌర్య ఫోన్ చేసిందా అని దీప షాక్ అవుతుంది. ఏంటి రౌడీ, ఏం మాట్లాడవని కార్తీక్ అనడంతో.. ఏం మాట్లాడను, జోత్స్న ఫోన్ ఇప్పుడే ఇచ్చిందని శౌర్య అంటుంది. దాంతో కార్తీక్‌కి విషయం అర్థమవుతుంది. అబ్బా.. ఎవరికి ఈ విషయాలు తెలియకూడదని అనుకుంటామో వాళ్లకే తెలుస్తుంటాయి. ఉన్న అనుమానాలు చాలవన్నట్టు మళ్లీ ఇదొక్కటి, ఇప్పుడు ఏమనుకుంటుందో.. ఏంటోనని కార్తిక్ అనుకొని ఫోన్ పెట్టేస్తాడు. ఇక కార్తీక్ పక్కనే ఉన్న స్వప్న.. ఏంటి బాస్ ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. ప్రాబ్లమ్ లేని మనిషి ఎవరుంటారు చెప్పు.. కాకపోతే నా బాధ వేరులే.. అక్కడేం గొడవ జరుగుతుందో ఏంటోనని కార్తిక్ టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు నువ్వెందుకు ఫోన్ తీశావని శౌర్యని దీప తిడుతుంది. శౌర్య ఏం తప్పు చేసిందని కోప్పడుతున్నావ్.. దాని ఫ్రెండ్‌కి అది ఫోన్ చేసుకుందిలే.. ఏంటి.. కొత్త ఫోనా.. మీ అమ్మ కొన్నదా అని జ్యోత్స్న అడుగుతుంది. లేదు.. లేదు.. మా అమ్మ కొనలేదు.. మా అమ్మకి కార్తీక్ ఫోన్ కొనిచ్చాడని శౌర్య అంటుంది. ఏయ్.. కార్తీక్ బాబు కొనివ్వడమేంటి? మనమే కొనుక్కున్నామని దీప అంటుంది. కార్తీక్ నీకు ఫోన్ ఇవ్వడం నేను చూశానమ్మా అని శౌర్య అంటే.. అక్కడేం జరిగిందో నీకు తెలియకుండా మాట్లాడకని దీప అంటుంది. పిల్లలు అబద్దాలు చెప్పరు దీప.. ఏది చూస్తే అదే చెప్తారు.. చెప్పింది కదా.. నాకు అర్థం అయ్యిందిలే.. ఫోన్‌లో కూడా విన్నాను. నిన్ను చేయి పట్టుకుని నేనే కదా ఇంటికి తీసుకుని వచ్చింది.. థాంక్యూ సో మచ్ అని చెప్పేసి జ్యోత్స్న వెళ్లిపోతుంది.

ఏంటమ్మా.. నీకు థాంక్స్ ఎందుకు చెప్తుంది.. కార్తీక్ నీకు ఫోన్ ఇచ్చాడు కదా.. అదే కదా చెప్పాను.. తప్పేంటమ్మా?? ఎందుకు కోప్పడుతున్నావని జ్యోత్స్న అడుగుతుంది. ఏంటే నువ్వు చూసింది.. రా నీకు చూపిస్తా అంటూ శౌర్యని దీప లోపలికి లాక్కుని పోతుంది. కాసేపటికి డబ్బాలో దాచిన ఫోన్ బిల్‌ని తీసి చూపించి.. ఇది నేను ఫ్రీగా తీసుకోలేదు.. కొనుక్కున్నాను.. కావాలంటే వెళ్లి నీ ఫ్రెండ్‌ని కార్తీక్‌ని అడుగమని శౌర్యపై దీప కోప్పడుతుంది. సారీ అమ్మా.. నేను తప్పుగా అనుకున్నాను.. నేను వెళ్లి జోకి జరిగింది చెప్పి వస్తానని శౌర్య అంటుంది. ఏం వద్దులే అని ఆపేసిన దీప.. ఈపాటికి వాళ్లు చేసుకోవాల్సిన అపార్థం చేసుకునే ఉంటారని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.