English | Telugu
బిగ్ బాస్ నుంచి తప్పుకున్న కమల్ హాసన్!
Updated : Feb 20, 2022
బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ నాని హోస్ట్ చేశాడు. ఆ తర్వాత నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలో ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. ఓటీటీకి కూడా నాగార్జునే హోస్ట్. ఇక తమిళ్ విషయానికొస్తే మొదటి సీజన్ నుంచి కమల్ హాసనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటిదాకా పూర్తి చేసుకున్న ఐదు సీజన్లకు కమలే హోస్ట్. బిగ్ బాస్ అల్టిమేట్ పేరుతో ఓటీటీలో అలరిస్తున్న తరుణంలో కమల్ ఊహించని షాక్ ఇచ్చాడు. 'విక్రమ్' సినిమా కారణంగా తాను బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశాడు.
"మహమ్మారి మరియు లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా 'విక్రమ్' సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యాయి. డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల నా మనస్సుకి ఎంతో దగ్గరైన బిగ్ బాస్ షోని వదులుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. బిగ్ స్టార్స్, టాప్ టెక్నిషీయన్స్ తో కలిసి విక్రమ్ మూవీ మిగతా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. నా కోసం వారిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో బిగ్ బాస్ అల్టిమేట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా పరిస్థితిని అర్థంచేసుకొని షో నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 6 తో మిమ్మల్ని అలరిస్తాను" అని కమల్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.
కాగా కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విక్రమ్ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకుడు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.