English | Telugu

నువ్వైనా మాట్లాడు లేదా న‌న్నైనా మాట్లాడ‌నివ్వు!

`స్టార్ మా`లో ఓంకార్ కొత్త‌గా మొద‌లుపెట్టిన డ్యాన్స్ షో `డ్యాన్స్ ప్ల‌స్‌`. డ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ అనే ట్యాగ్ లైన్‌తో మొద‌లుపెట్టిన ఈ షోలో బాబా భాస్క‌ర్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, య‌ష్‌, యానీ, ముమైత్‌ఖాన్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ న్యాయ నిర్ణేతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓంకార్ ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌. గ‌త కొన్ని వారాలుగా శ‌ని ఆదివారాలు ప్ర‌సారం అవుతూ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

అద్భుత‌మైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ డ్యాన్స్ షో జ‌డ్జిల వాదులాట‌.. కంటెస్టెంట్ల భావోద్వేగాల‌తో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. అయితే ఈ వారం ప్ర‌సారం కానున్న షోలో ర‌ఘు మాస్ట‌ర్, రామ్ ల‌క్ష్మ‌ణ్‌ల మాస్ట‌ర్ మ‌ల్లేష్‌కు మ‌ధ్య మ‌డ‌త పేచీ జ‌డ్జెస్‌ని విస్మాయానికి గురిచేసింది. కాన్సెప్ట్ రౌండ్‌లో జోక‌ర్స్ గెట‌ప్‌ల‌తో స్టేజ్‌పైకి వ‌చ్చిన రామ్- ల‌క్ష్మ‌ణ్ కామెడీని పండిస్తూ హావ భావాల‌తో న‌వ్విస్తూ డ్యాన్స్ చేశారు.

అయితే ఇందులో త‌న‌కు డ్యాన్స్ క‌నిపించ‌లేద‌ని ర‌ఘు మాస్ట‌ర్ రెడ్ ఇచ్చాడు. దీంతో రామ్-ల‌క్ష్మ‌ణ్ ల మాస్ట‌ర్ మ‌ల్లేష్ జ‌డ్జ్ ర‌ఘు మాస్ట‌ర్‌తో వాద‌న‌కు దిగాడు. "ఇది కాన్సెప్ట్ రౌండ్‌.. డ్రామా చేస్తేనే క‌దా కాన్సెప్ట్ పండేది.. మీకు డ్యాన్స్ చూపించాను, కాన్సెప్ట్ చూపించాను, ఎమోష‌న‌ల్ చూపెట్టాను.. న‌వ్వేది కూడా చూపెట్టాను. మీకు కావాల్సింది నేనిచ్చాను క‌దా".. అని ర‌ఘు మాస్ట‌ర్‌తో వాద‌న‌కు దిగాడు.

దీంతో "ఒక‌టి నువ్వైనా మాట్లాడు లేదా న‌న్నైనా మాట్లాడ‌నివ్వు"... అని ర‌ఘు మాస్ట‌ర్ అన‌డంతో .. "నాకు త‌ప్ప‌నిపిస్తే జ‌డ్జైనా ఫ‌ర‌వాలేదు.. ఆ దేవుడైనా ఫ‌ర‌వాలేదు.. నేను మాట్లాడ‌తా.. నాకు ఇక్క‌డ ఏది అనిపిస్తే అదే మాట్లాడ‌తా." అంటూ మ‌ల్లేష్ సీరియ‌స్ అయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం సంద‌డి చేస్తోంది.