English | Telugu
ఎమ్మెస్ చనిపోయే ముందు బ్రహ్మానందాన్ని చూడాలన్నారు!
Updated : Dec 8, 2021
1200 లకు పైగా సినిమాలలో నటించి కామెడీ కింగ్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. కొన్నేళ్ల పాటు ఆయన కనిపించని తెలుగు సినిమా లేదంటే అతిశయోక్తి కాదేమో. చిన్నదైనా పెద్దదైనా ఏదొక పాత్రలో ఆయన తమ సినిమాలో కనిపిస్తే చాలని దర్శకనిర్మాతలు భావించేవారు. అయితే ఇప్పుడు వయస్సు రీత్యా విశ్రాంతి తీసుకుంటూ సినిమాలు తగ్గించిన బ్రహ్మానందం.. ఆలీ హోస్ట్ గా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్న ఆయన.. ఎమ్మెస్ నారాయణ చనిపోయే గంట ముందు తనని చూడాలి అనుకున్నారని తెలిపారు.
Also Read:ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై స్పందించిన బాలయ్య
ఎమ్మెస్ నారాయణకు తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి బ్రహ్మానందం పంచుకున్నారు. ఎమ్మెస్ తనని అన్నయ్య అని పిలిచేవాడని, ఎప్పుడూ జోకులు వేసి నవ్వించేవాడని అన్నారు. "కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెస్, ఇంకో గంటలో చనిపోతాడు అనగా.. తన కుమార్తెను అడిగి పెన్ను, పేపర్ తీసుకొని.. దానిపై ‘బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది’ అని రాశాడు. అప్పుడు నేను శంషాబాద్ లో ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా షూటింగ్‌లో ఉన్నా. ఎమ్మెస్ కుమార్తె నాకు ఫోన్ చేసి ‘నాన్న ఆరోగ్యం బాగాలేదు.. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు' అని చెప్పారు. వెంటనే షూటింగ్ లో అనుమతి తీసుకొని ఆస్పత్రికి వెళ్లా. ఎమ్మెస్ నా చేయి గట్టిగా పట్టుకొని.. అన్నయ్య అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు.. కానీ నాకు అర్థం కాలేదు. వాళ్ల అబ్బాయిని పిలిపించి తన వంక, నా వంక అలాగే చూస్తూ ఉన్నాడు. నా వల్ల కాక నేను బయటకు వచ్చేశా. నేను బయటకొచ్చిన 15-20 నిమిషాలకే ఎమ్మెస్ చనిపోయాడు" అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.
Also Read:షణ్ముఖ్ - దీప్తి పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఉమారాణి
ప్రస్తుతం తాను ఎక్కువ సినిమాలలో నటించకపోవడంపై కూడా బ్రహ్మానందం స్పందించారు. "సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తూనే ఉన్నా. అప్పుడు మేం రోజుకు 18గంటలు చేశాం. కెరీర్ చివర్లో అయినా కాస్త సుఖపడాలనుకుంటున్నాను. రెండేళ్ల కిందట నాకు హార్ట్ బైపాస్ సర్జరీ జరగడంతో ఇంట్లోవాళ్లు కూడా ‘కష్టపడింది చాలు.. ఇక సినిమాలు చేయొద్దు’ అని చెప్పారు. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’, ‘రంగమార్తాండ’, ‘కలవారి కోడళ్లు’, నితిన్ సినిమాలో నటిస్తున్నాను" అని బ్రహ్మానందం చెప్పారు.