English | Telugu
భార్యను గోడకేసి కొట్టిన నటుడి అరెస్ట్!
Updated : Jun 1, 2021
ప్రముఖ హిందీ టెలివిజన్ నటుడు కరణ్ మెహ్రాను పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత రాత్రి భార్య నిషా రావల్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కరణ్ ను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అయితే వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చాడు కరణ్. 'యే రిష్తా క్యా కెహ్లతా హై' అనే సీరియల్‌తో పాపులర్ అయిన కరణ్ ఆ తరువాత పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. చాలా కాలం పాటు నిషాతో డేటింగ్ చేసిన కరణ్ 2012లో ఆమెను పెళ్లాడాడు.
ఈ జంటకు కవిష్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కరణ్-నిషా జంటగా 'నాచ్ బలియే' సీజన్ 5లో పాల్గొన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాము బాగానే ఉన్నామని.. ఈ వార్తల్లో నిజం లేదని స్పందించారు. రీసెంట్‌గా కరణ్‌కి కరోనా సోకినప్పుడు.. తన భార్య నిషా ఎంతో ధైర్యం చెప్పిందని.. తనను చాలా జాగ్రత్తగా చూసుకుందని చెప్పాడు.
అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా నిషా తన భర్తపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కొన్ని వారాలుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఇప్పుడు అవి తారా స్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. ఆ సమయంలో కరణ్ ఆవేశంతో నిషా తలను గోడకేసి కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో నిషా పోలీసులను ఆశ్రయించింది. కరణ్‌పై సెక్షన్ 336, 337 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముంబైలో తన నివాసంలో ఉన్న కరణ్‌ను అరెస్ట్ చేశారు.