English | Telugu
బిగ్‌బాస్ 6 లో సుబ్బు సింగ్ ఎవరు?
Updated : Jun 28, 2022
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్ లని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఓటీటీ వెర్షన్ ని కూడా ఇటీవలే పూర్తి చేసింది. త్వరలోనే బిగ్ బాస్ 6వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సీజన్ సీజన్ కి విమర్శలు వెళ్లువెత్తుతున్నా అదే స్థాయిలో పాపులారిటీని, వీవర్షిప్ ని పెంచుకుంటూ పోతోంది. ఇక 6 వ సీజన్ లో ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్ ల ఎంపిక దాదాపుగా పూర్తయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సామాన్యులకు కూడా ఈ సీజన్ లో అవకాశం ఇవ్వబోతున్నామని నిర్వాహకులు ప్రకటించడంతో చాలా మంది ఔత్సాహికులు ప్రయత్నాలు మొదలు పెట్టారట. ఇప్పటికే నటుడు వడ్డే నవీన్ కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆది, అమర్ దీప్, దీపికా పిల్లి, వర్షిణి, యాంకర్ ధనుష్ లతో పాటు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యాంకర్ శివ, అనిల్, మిత్రా కూడా హౌస్ లోకి రాబోతున్నారని చెబుతున్నారు.
ఇదిలా వుంటే మొట్ట మొదటి సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఓ వకీల్ సాబ్ కూడా ఎంటర్ కాబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 6 జూలై 6 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ సుబ్బు సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరీ సుబ్బుసింగ్ అని ఆరాతీస్తే.. పేదల కోసం వందల కేసులు ఫ్రీగా వాదించారట. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తుంటారట. భర్త చనిపోయిన స్త్రీలు, ఒంటరి మహిళల కేసుల్ని ఫ్రీగా వాదించి వారికి అండగా నిలిచారట. ఆ కారణంగానే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సిద్ధార్ధ గ్రామానికి చెందిన సుబ్బు సింగ్ కు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ లభించిందని చెబుతున్నారు.