English | Telugu
శ్రీహాన్, ఇనయాల మధ్య గొడవ ముదురుతోందా?
Updated : Sep 28, 2022
ఇరవై మూడవ రోజు 'పైసా వసూల్' పాటతో మొదలైంది. సోమవారం జరిగిన నామినేషన్లో హౌస్ మేట్స్ లో ఉన్న వారిలో దాదాపు తొంభై శాతం ఇనయాని నామినేట్ చేసారు. దీంతో ఇనయా పని అయిపోయింది అని అనుకున్నారు అందరు. కానీ తాజాగా పోలైన ఓట్లలో మాత్రం ఇనయా సెకండ్ ప్లేస్ లో సేఫ్ గా ఉంది. వాసంతి, ఆరోహీ మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు. బయటకు వెళ్ళేది వారిద్దరిలో ఎవరో ఒకరు అనే అనుకుంటున్నారు ప్రేక్షకులు.
నామినేషన్ తర్వాత ఇనయా బాగా ఏడ్చేసింది. తర్వాత ఫైమా మాట్లాడుతూ, "ఇనయాది తప్పు లేదు రా పాపం, కానీ ఒకరు నామినేట్ చేసారు కదా అని అందరూ తననే నామినేట్ చేసారు అది చాలా తప్పురా" అని వాసంతితో చెప్పింది. ఆ తర్వాత ఇనయా దగ్గరికి మెరీనా వచ్చింది. కాసేపు మాట్లాడి, హత్తుకొని ఓదార్చింది. హౌస్ మేట్స్ అందరూ ఇనయాని ఓదార్చే పనిలో ఉండగా, శ్రీహాన్ మాత్రం ఒక్కడే తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. "నేను తనను అనలేదు, అయినా సరే తననే అన్నట్లు, అంతలా ఫీల్ అవ్వాలా, ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఇంత సాగాదీయాలా, వామ్మో! 'ఆస్కార్ లెవల్ యాక్టింగ్' అని శ్రీహాన్ ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు.
హౌస్ లో దాదాపుగా అందరి మధ్య విభేదాలు, చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. కానీ ఎవరి గొడవను వాళ్ళు పరిష్కరించుకుంటున్నారు. లేదా కాసేపు అయ్యాక ఇద్దరిలో ఎవరిది తప్పో తెలుసుకొని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని మర్చిపోతున్నారు. అయితే శ్రీహాన్ కి, ఇనయాకి మాత్రం గొడవ ఇంకా అలాగే కొనసాగుతోంది. అయితే ఈ వారం వీరిద్దరూ కూడా నామినేషన్లో ఉన్నారు. వీరిద్దరి మధ్యలో జరిగిన గొడవ ఇకముందు ఎంత వరకు వెళుతుందో చూడాలి.